సాగుబడి
ఈత చెట్టు
వీటి జీవితకాలం దాదాపు 40–60 సంవత్సరాలు
కల్లు గీసే చెట్లు త్వరగా చనిపోతాయి
ఈత చెట్టు రూపురేఖలు ఖర్జూరపు చెట్టుకు అతి దగ్గరగా ఉంటాయి. పుష్పించే విధానం, పండ్ల గుత్తులూ ఒకేలాగ ఉంటాయి. ఈ చెట్టు తెలియని వారుండరు. తరతరాల నుండి గుర్తున్న చెట్లల్లో ఈత చెట్టు ఒకటి. పల్లెవాసులకే కాకుండా పట్టణవాసులకూ సుపరిచితమైన చెట్టు ఈత. దీని ఔషధ విలువల వల్ల ఈ చెట్టుకు చాలా ప్రాచుర్యమున్నది. దీన్ని ‘సిల్వర్ డేట్ పాం’ అని కూడా పిలుస్తుంటారు.
ఉనికి..
ఈ చెట్టు సుమారు 4 నుండి 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. పూత–కాత మాత్రం కొంత అటు–ఇటు అయినా (పరిస్థితులను బట్టి) ఏప్రిల్ నుండి ఆగష్టు మధ్య ఉంటుంది. తేమ ఎక్కువగా ఉన్న నేలల్లో పెరుగుతుంది. అట్లని ఇతర నేలల్లో రాదని కాదు. ఈత పల్లపుప్రాంతాల్లో కూడ వస్తుంది. ఎక్కువగా వాగులు, వంకలు ఉన్న దగ్గర పెరుగుతుంది. వీటి స్వస్థలం దక్షిణ పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, మైన్మార్, బంగ్లాదేశ్, మారిషస్, చగోస్ ఆర్చిపిలాగై, పుర్టోరికో, ‘లీవర్డ్ ఐలాండ్’లు.
ఈత చెట్టు సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తువరకు ఉండే ప్రాంతాలలో కూడా రాగలదు. దీని కాయలు ఆకు పచ్చరంగులో ఉండి పక్వానికి వచ్చిన తరువాత పసుపు రంగుకు, పండుగా మారినప్పుడు కాషాయ రంగుకు మారతాయి. ఈత చెట్లు దేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటి జీవితకాలం దాదాపు 40–60 సంవత్సరాలు. కానీ కల్లు గీసే చెట్లు త్వరగా చనిపోతాయి. ఈత చెట్లపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
ఉపయోగాలు
ఈత ఆకులతో రకరకాల వస్తువులను తయారు చేస్తారు. చాలా మందికి ఇది ఉపాధి కూడా (చాపలు, ఈత పొరకలు, చిన్న చిన్న ఆట వస్తువులు)
గుడిసెల పైకప్పుకు ఈ ఆకులను ఉపయోగిస్తారు.
మొగిలోన పిండి పదార్థం రుచిగా ఉంటుందని గ్రామస్తులు దాన్ని సేకరించి వాడుతారు. మొగి తీయడం వల్ల చెట్టు చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ మొద్దును రెండుగా చీల్చి మధ్యన ఉన్న భాగాన్ని తీసి అనేక విధాలుగా వాడుతారు. (ఉ: చిన్న చిన్న కాలువలు దాటటానికి అడ్డంగావేస్తారు. దానిపై కాలినడక సాగిస్తారు. పందిళ్లకు పోల్స్‌గా వాడుతారు.
ప్రధానంగా ఈత చెట్టు నుండి ‘నీరా, కల్లు’ తీస్తారు. ఉదయం సూర్యోదయం కాకముందు చెట్టు నుండి తీసేది ‘నీరా’. ఆ తర్వాత నీరా పులిసి కల్లుగా మారుతుంది. నీరాకు మార్కెట్‌లో చాలా మంచి డిమాండ్ ఉంది.
నీరాను సేవించడం వల్ల కిడ్నీలోని రాళ్ళు కరిగి పోతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం.
నీర నుండి ‘ఈత బెల్లాన్ని’ తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు అంటారు.
ఈత పండ్లు రుచిగా ఉంటాయి.
ఈత పండ్ల నుండి జామ్, జల్లి వంటి విలువ ఆధారిత పదార్ధాలను తయారు చేస్తారు.
ఈ పండ్లు తినడం వల్ల బ్యాక్ పెయిన్, పిరుదులపై కండరాలు పట్టినట్లు ఉంటే తగ్గుతాయి. (ఇవి టానిక్ లా పనిచేస్తాయి).
పండ్లు కూడా ఎన్నో పోషక విలువలు కలవి.
చెట్లను ల్యాండ్ స్కేపింగ్‌లో అందం కోసం నాటుతారు.
వేర్లను పండ్ల నొప్పులను, నర్వస్ డెబిలిటీ, హెల్మింథియాసిస్ జబ్బులను నయం చేయటానికి ఉపయోగిస్తారు.
నీరాను ఎండకాలంలో తాగితే చలువ చేకూర్చుతుంది. ఇందులో కూడా అనేక పోషక విలువలున్నవి.
ఔషధంగా ఈతకు ప్రత్యేకత ఉంది. ఉదర సంబంధిత జబ్బులు, జ్వరాలు, మూర్ఛ, అజీర్తి, హృదయ సంబంధిత జబ్బులను నయం చేయటంలో ఈత నీరా గాని, బెల్లంగాని, మొగి గాని వాడుతారు.
నీరాలోని ఇనుము వంటి సూక్ష్మపోషకాలు, బి12 వంటి విటమిన్లు రోగులకు చాలా మంచిది. రెగ్యులర్ గా సేవిస్తే వారిలో రక్తశుద్ధి జరిగి హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
పండ్లలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల పటుత్వానికి దోహద పడుతుంది.

ఈతకు పెద్ద ఈత, ఈత అని రెండు పేర్లున్నాయి.
ఇంగ్లిష్: వైల్డ్ డేట్ పాం, డేట్ సుగర్ పాం, ఇండియన్ వైల్జ్ డేట్, ఇండియన్ వైన్ పామ్
అస్సామీ: ఖాజురి;
ఉర్దూ: ఖాజర్;
ఒరియా: ఖర్జుర్;
గుజరాతీ: ఖజ్జార్, ఖజా;
కన్నడ: ఇచలు;
తమిళంలో: ఇచం, పేరియా, ఇలచం;
బెంగాలీ: ఖర్జూర, ఖఝూర్;
పంజాబీ: ఖజుర్;
మణిపురి: తంగటప్;
మరాఠీ: సెండి, బైచంగ్, ఖర్జూర్, షిండ్రీ, షింధీ;
మలయాళం: కట్టింతా, కట్టింతై, నీలన్ తెంట్
హిందీ: ఖజూర్;
సంస్కృతం: ఖర్జూరహా, ఖర్జూర్
నేపాలీ: ఖండేలా, ధడ అంటారు.
నల్లమల అడవులు:
నలమలప్రాంతంలో ఈత చెట్లు ఉన్నాయి. ఇవి అంది నేలల్లో (చౌడు నేలల్లో) కూడా ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్నాయి. అడవిలోని సెలయేర్లు/వంకలు/ డొంకల దగ్గర ఉన్న వాటిలో పోషక విలువల్లో వ్యత్యాసం ఉండవచ్చు. కాబట్టి వీటిపై పరిశోధన చేపట్టి కొత్త వంగడాల అన్వేషణ మొదలు కావలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ చెట్టు కల్లు, పండ్లకే కాకుండా విలువాధారిత ఉత్పత్తులపై శోధించగలితే ఎంతో లాభసాటిగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఈత వనాలతో ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే కొందరు ఈత వనాలు పెంచి కేవలం నీరా–కల్లు కోసమే ఉపయోగిస్తున్నారు. ఈత చెట్లు తెలుగు రాష్ట్రాల్లోని అడవుల్లో కూడా ఉన్నాయి.

- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


