
సోదరికి ఎప్పటికీ రక్షణగా ఉండాలని సోదరుడు అనుకుంటాడు. సోదరుడు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది సోదరి. హవీష్, నిఖిల అలాంటి అన్నాచెల్లెళ్లే. అయితే... సోదరికి ఎప్పటికీ రక్షణగా ఉంటానని భరోసా ఇవ్వడంతో పాటు ‘నిన్ను నువ్వు కాపాడుకునేంత ధైర్యం నీలో ఉండాలి... ఎవరి మీదా ఆధారపడకూడదు’ అని కూడా చెబుతుంటారు హవీష్. అలాగే... అన్నయ్యను ఎవరైనా ఏమైనా అంటే... వాళ్లను ఏమాత్రం క్షమించరు నిఖిల. ‘నువ్విలా, జీనియస్, రామ్‌లీల’ తదితర చిత్రాల్లో నటించిన హవీష్ ప్రస్తుతం ‘నేను రెడీ’లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తన చెల్లెలు నిఖిలను నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. నేడు ‘రాఖీ పండగ’ సందర్భంగా ఈ అన్నాచెల్లెళ్లు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు.
హవీష్: రాఖీ పండగకి ఎక్కడున్నా సరే నిఖిల నన్ను కలిసి, రాఖీ కడుతుంది. నా చేతికి తను రాఖీ కడుతున్నప్పుడు ‘నువ్వు క్షేమంగా ఉండాలి. ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటాను’ అని అనుకుంటాను. అయితే రక్షణగా ఉండటం అంటే తనని నా మీద ఆధారపడేలా చేయడం కాదు. లైఫ్‌లో ఏ విషయాన్నయినా హ్యాండిల్ చేసే నేర్పు, ధైర్యం తనకి ఉండాలి. అదే చెల్లితో చెబుతాను.
నిఖిల: ‘నీ లైఫ్ లాంగ్ నువ్వు క్షేమంగా ఉండాలి. ఏ విషయంలో అయినా నీకు తోడుగా ఉంటాను’ అనుకుంటూ అన్నయ్య చేతికి రాఖీ కడుతుంటాను. ‘డిపెండ్ కావొద్దు’ అని అంటుంటాడు. కానీ ఏ క్షణంలో అయినా నీకు నేను తోడుగా ఉంటాననే భరోసాను అన్నయ్య ఇస్తాడు. (ఒకే ఒక్క టిప్‌తో స్లిమ్‌గా కీర్తి సురేష్ : కానీ ఈ రెండూ కీలకం)
హవీష్: నా చెల్లెలు అనే కాదు... ఏ అమ్మాయికి అయినా నేను ఒకటే చెబుతాను. మీరు అనుకున్నది సాధించడానికి రాజీపడొద్దు. ‘అమ్మాయి కదా ఏం చేస్తుందిలే... అమ్మాయిలు ఇలాంటి ఉద్యోగానికి పనికి రారు’ అని సొసైటీలో ఓ అభిప్రాయం ఉంది. అయితే అమ్మాయిలు ఎంత పెద్ద బాధ్యత అయినా సమర్థవంతంగా స్వీకరించగలరు.
నిఖిల: అన్నయ్య చెప్పిన ఈ మాటతో నేను ఏకీ భవిస్తున్నాను. ‘నేను సంపాదించుకుంటేనే’ అనే పరిస్థితి నాకు లేదు. అయినప్పటికీ నా అవసరాల కోసం నేను సం΄ాదించుకుంటే ఆ తృప్తి, ధైర్యం వేరు.
ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
హవీష్: యాక్చువల్లీ చెల్లి బిజినెస్ ఫీల్డ్‌లో ఉంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా చేస్తుంటుంది. సినిమా ప్రొడక్షన్ డిఫరెంట్ అయినప్పటికీ నేను హీరోగా నటిస్తున్న ‘నేను రెడీ’ సినిమాని ప్రొడ్యూస్ చేయమన్నాను. రెండే రోజుల్లో గ్రిప్ తెచ్చేసుకుని పర్ఫెక్ట్‌గా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది.
నిఖిల: ప్రొడ్యూసర్‌గా ‘నేను రెడీ’ నా ఫస్ట్ మూవీ. ప్రొడక్షన్ చూసుకోమని అన్నయ్యే ఎంకరేజ్ చేశాడు. హీరోగా నటిస్తూ ప్రొడక్షన్ కూడా చూసుకుంటే యాక్టింగ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టలేనని తనకి అనిపించింది. దాంతో నన్ను అడిగాడు... వెంటనే ఓకే అన్నాను.
హవీష్: నా చిన్నప్పుడు నన్నెవరైనా ఏమైనా అన్నారని తెలిస్తే... నాక్కూడా చెప్పకుండా వెళ్లి వార్నింగ్ ఇచ్చి, ఆ తర్వాత నాకు చెప్పేది. కానీ మా ఇద్దరికీ ఒకే ఒక్క విషయంలో పడేది కాదు. ఎప్పుడూ తను స్కూల్‌కి లేటే. తనవల్ల నేనూ గేటు బయట నిలబడాల్సి వచ్చేది. కోపం పట్టలేక కొట్టేవాణ్ణి (నవ్వుతూ).
నిఖిల: చిన్నప్పుడు ఆ ఒక్క విషయంలో తప్ప మాకు వేరే గొడవలేం ఉండేవి కావు. ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ విషయంలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి (నవ్వుతూ). డైరెక్టర్ త్రినాథరావుగారికి నేను కొంచెం ఉత్సాహంగా ఏదైనా చెప్పబోతే అన్నయ్యకి నచ్చదు. డైరెక్టర్ ఏది చెబితే అది చేయాలన్నది తన మైండ్‌సైట్.
హవీష్: నా చెల్లెలు నా సినిమాని నిర్మించడం ఈ రాఖీకి తను నాకు ఇస్తున్న బెస్ట్ గిఫ్ట్.
నిఖిల: ‘నేను రెడీ’ని ‘ది బెస్ట్’ సినిమాగా చేసి, అన్నయ్యకి గిఫ్ట్ ఇస్తాను.
నా పెళ్లిప్లాన్ అంతా తనదే : నాది లవ్ మ్యారేజ్. నా భర్త తెలుగు అయినప్పటికీ తమిళనాడులో పుట్టి, అక్కడే పెరిగారు. మా పేరెంట్స్ ఓకే అన్నారు కానీ, తెలుగు తెలియని వ్యక్తితో ఎలా మాట్లాడాలి? అంటూ అన్నయ్య పెద్దగా ఇష్టపడలేదు. అయితే నా ఇష్టాన్ని కాదనలేదు. పెళ్లికి ఏ థీమ్ అయితే బాగుంటుంది? ఎలాంటి వేదిక ఏర్పాటు చేయించాలి? ఫుడ్ మెనూ ఎలా ఉంటే బాగుంటుంది... ఇలా ప్రతిదీ దగ్గరుండి బాగా ప్లాన్ చేసి, ఓ తండ్రిలా నిలబడి చేశాడు. నా చిన్నప్పట్నుంచి మా అన్నయ్య నాకు ‘ఫాదర్ ఫిగర్’లా ఉన్నాడు.- నిఖిల
నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు : నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. మ్యారేజ్ అంటే పెద్దగా నమ్మకం లేదు. మరి... భవిష్యత్‌లో నిన్నెవరు చూసుకుంటారు? అని ఎవరైనా అడిగితే ‘మా చెల్లి’ అని చెబుతాను. ఇప్పుడు నా పేరెంట్స్‌తో ఉంటున్నాను. ఫ్యూచర్‌లో నా చెల్లెలే నాకు మదర్ - హవీష్
అవును... చూసుకుంటాను. అయితే పెళ్లి చేసుకోమని తనని ఒత్తిడి చేయను. నా చిన్నప్పట్నుంచి నన్ను తండ్రిలా చూసుకుంటున్నాడు. భవిష్యత్‌లో నేను తనని తల్లిలా చూసుకుంటాను -నిఖిల
-డీజీ భవాని