జనతంత్రం
‘‘సాంకేతిక నైపుణ్యం, మేధస్సు, మంచి ఆలోచనలూ, పెట్టుబడులూ ఉన్నంత మాత్రాన ఒక జాతి అభివృద్ధి పథంలో పయనించదు, సమర్థవంతమైన నాయకత్వం కూడా ఉండాలి’’. ఈ అద్భుతమైన కొటేషన్‌ను ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలువరించారు. అటువంటి సమర్థ నాయకత్వానికి దూరదృష్టి, చిత్తశుద్ధి, విశ్వసనీయతలు కొలమానాలని కూడా ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీలో గత పాతికేళ్లుగా ఈ నాయకత్వ సుగుణాలను తాను చూస్తున్నానని బాబు చెప్పుకొచ్చారు. సరిగ్గా పాతికేళ్ల కింద గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ పదమూడేళ్ల పాటు ఆ పదవిలో, మరో పన్నెండేళ్లుగా ప్రధాని పదవిలో నిరంతరాయంగా కొనసాగుతూ దేశాభివృద్ధికి, ప్రజల సాధికారత కోసం పట్టుదలతో పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు.
ప్రధానమంత్రి సాధించిన ఈ రికార్డు నిజంగానే అసాధారణమైనది. నభూతో నభవిష్యతి అని కూడా అనవచ్చేమో! అరుదైన ఈ ఘనతను సాధించిన ప్రధానిని దేశంలో ఉన్న రాజకీయ ముఖ్యులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు కూడా అభినందించారు. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ది హిందూ’ పత్రికలో చంద్రబాబు నాయుడు ఒక వ్యాసాన్ని రాశారు. అందులో మోదీ నాయకత్వ పటిమను ప్రశంసిస్తూ ఆయన సారథ్యంలో దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నదని సోదాహరణంగా విశదీకరించారు. ఎన్డీఏ కూటమిలో ఒక ముఖ్య భాగస్వామిగా ఉన్న చంద్రబాబు అలా రాయడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.
చంద్రబాబు కూడా చిన్న నాయకుడేమీ కాదు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. కరుణానిధి తర్వాత దక్షిణాదిన ఆయనదే ఈ రికార్డు. అటువంటి నాయకుడు వ్యక్తం చేసే అభిప్రాయాల్లో స్థిరత్వం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. పూటకో మాట మాట్లాడితే ఇక విశ్వసనీయత ఎక్కడుంటుంది? విశ్వసనీయత, చిత్త శుద్థిలేని నాయకులు జాతిని ముందుకు నడిపించలేరనే భావన కూడా ఈ వ్యాసంలో కనిపిస్తుంది. నాయకుడు తన అభిప్రాయాలను ఎన్నటికీ మార్చుకోకూడదని ఎవరూ చెప్పరు. అయితే అటువంటి మార్పు ఎందుకువచ్చిందో, కారణాలేమిటో స్పష్టం చేస్తేనే మారిన అభిప్రాయానికీ, మార్చుకున్న నాయకునికీ విశ్వసనీయత పెరుగుతుంది.
నరేంద్ర మోదీ పాతికేళ్ల అధికార కాలాన్ని గంపగుత్తగా ‘ది హిందూ’ వ్యాసంలో చంద్రబాబు సమర్థించారు. ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ ఈ పాతికేళ్ల ప్రయాణం సాగిందని బాబు అభినందించారు. మోదీ వ్యక్తిగత ఔన్నత్యం, క్రమశిక్షణ వగైరాలను ప్రస్తావించడంతో పాటు దేశాభివృద్ధికి ఆయన చేపట్టిన పథకాలను ప్రస్తావిస్తూ వాటి గురించి గొప్పగా కితాబులిచ్చారు. ఈ వ్యాసాన్ని చదివిన వారికి చంద్రబాబు తీసుకున్న ఇంత పెద్ద యూ టర్న్ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. పాతికేళ్ల వెనక్కు కూడా వెళ్లనవసరం లేదు. ఏడెనిమిదేళ్ల కిందటి చంద్రబాబు మాటలు గుర్తుకు చేసుకున్నా కూడా ఆయన విశ్వసనీయత ఏపాటిదో అర్థమౌతుంది. గతంలో నరేంద్ర మోదీని, ఆయన విధానాలనూ అపార్థం చేసుకున్నాననీ ఇప్పుడు జ్ఞానోదయమైన కారణంగా ప్రశంసిస్తున్నానని ఒక వాక్యం రాసి ఉన్నట్లయితే ‘ది హిందూ’ వ్యాసానికి సార్థకత చేకూరేది. అటువంటి సంజాయిషీ ఏమీ లేదు కనుక ఈ పొగడ్తలన్నీ పబ్బం గడుపుకోవడానికేనని ఎవరైనా భావిస్తే తప్పు పట్టగలమా?
ప్రధానమంత్రిపై వ్యక్తిగతంగానూ, విధానాల పరంగానూ ఎవరూ విమర్శించని స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడిన ఘటనలు కేవలం ఏడెనిమిదేళ్లు వెనక్కి వెళ్లినా కనిపిస్తాయి. 2019 ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ‘‘గురువుకు పంగనామాలు పెట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ, నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే సంస్కారం మోదీకి లేదు, ఆయనకు కుటుంబ బంధాల గురించి తెలియదు. విడాకులివ్వకుండా భార్యను దూరం పెట్టాడు. పెద్ద నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య, ఆయన పాలనలో బ్యాంకులు దివాళా తీశాయి. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశాడని’’ బాబు విరుచుకుపడ్డారు. నిండుసభలో మాట్లాడిన ఈ మాటలకూ, హిందూ వ్యాసంలో ప్రకటించిన అభిప్రాయాలకూ ఏమైనా సామ్యం ఉన్నదా?
‘‘59 వేల కోట్ల రఫేల్ ఒప్పందం దేశరక్షణ రంగంలోనే అతి పెద్ద కుంభకోణం. ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశం ఉన్నది. దేశాన్ని మోసం చేశారు. మోదీజీ... సత్యాన్ని ఎక్కువకాలం దాచలేరు’’ అంటూ 2019 ఫిబ్రవరి 8న బాబు ట్వీట్ చేశారు. అప్పుడు దేశాన్ని మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే పరిణామం ఎలా సంభవించిందో బాబు వివరించాలి కదా! అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ‘‘భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని’’ కూడా మోదీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. నరేంద్ర మోదీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదని ఆ సమయంలోనే టీడీపీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. నరేంద్రమోదీ ఓ కేడీ అనీ, దేశం మొత్తం ఆయన్ను చోర్ అని పిలుస్తున్నదనీ కూడా ఆనాటి ఎన్నికల సభల్లో బాబు విమర్శలు చేశారు. మోదీకి దేశభక్తి లేదనీ, రాజకీయ భక్తి మాత్రమే ఉన్నదని దేశంలోని వ్యవస్థలన్నింటినీ ఆయన ధ్వంసం చేస్తున్నారని కూడా బాబు ధ్వజమెత్తారు.
ఏడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల సందర్భంలో మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలన్నీ గుదిగుచ్చితే ఓ పుస్తకం అవుతుంది. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ హైదరాబాద్‌కు వస్తే అరెస్ట్ చేస్తానని అన్న విషయాన్ని గుర్తు చేయటం అప్రస్తుతం కాకపోవచ్చు. గోథ్రా అల్లర్ల నేపథ్యంలోనే చంద్రబాబు అలా మాట్లాడారు. కానీ, అప్పటినుంచే మోదీ గొప్ప నాయకత్వ లక్షణాలు కలవాడనీ, దేశాభివృద్ధికోసం కష్టపడ్డారని ఇప్పుడు మాట మార్చుతున్నారు. ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు మార్చుకోకపోతే పొలిటీషియన్ కానేరడు’ అనే గిరీశం నిర్వచనానికి ఈ పిల్లిమొగ్గలు సరిపోతాయేమో కానీ, చిత్తశుద్ధి, విశ్వసనీయతలే నాయకత్వానికి కొలమానాలని చంద్రబాబు హిందూ వ్యాసంలో చెప్పిన నిర్వచనానికి మాత్రం సరిపోలవు. పోనీ, మోదీపై తీసుకున్న ఈ తాజా వైఖరికి చంద్రబాబు కట్టుబడి ఉంటారా? వచ్చే ఎన్నికల్లో ఒకవేళ మోదీ ప్రభుత్వం ఓడిపోతే గెలిచిన కూటమిలో దూరకుండా ఉంటారా?
2019 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవచ్చనే అంచనాలతోనే ఆయన కూటమి నుంచి వైదొలిగారనే అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయంతోనే విమర్శలతో చెలరేగిపోయారనీ, ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే ప్లేటు మార్చి కాళ్ల బేరానికి దిగడమే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తారు. అప్పుడు ఎన్డీఏ నుంచి వైదొలగిన సందర్భంగా తిరుపతిలో ‘ధర్మ పోరాటం’ పేరుతో జరిపిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నవాడే నాయకుడని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అంటే తను ఆచరించడానికి గిరీశం ఫిలాసఫీ, నీతులు చెప్పడానికి హిందూలో రాసిన ఫిలాసఫీ అనుకోవాలి. ‘‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..’’ అంటూ హిందూలో రాసిన ప్రేమలేఖలాంటి వ్యాసం పవిత్రమైనదా, కపటంతో కూడినదా అనే సందేహం ఎవరికైనా సహజంగానే తలెత్తుతుంది.
కేంద్రంలో మోదీ సర్కార్ గత పన్నెండేళ్లలో ఎన్నడూ ఎరుగనంతటి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. యువతరంలో గూడుకట్టుకున్న అసంతృప్తి ఉద్యమ రూపాలను తీసుకుంటున్నది. బూటకపు ఎన్నికల బండారం బట్టబయలై రాజకీయ పార్టీలు వీధుల్లోకి వస్తున్నాయి. యువతరంతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకలు పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయాస పడుతున్నారు. వారి వీధి పోరాటాలను ఎద్దేవా చేస్తూ ఎన్డీఏలోని బీజేపీ సహా ఇతర పక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. కూటమిలో రెండో ప్రధాన పక్షమైన తెలుగుదేశం అధినేత మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద విమర్శనాస్త్రాలకు దూరంగా ఉండిపోవడం కూడా పరిశీలకుల దృష్టిని దాటిపోలేదు. ఏమో, గుర్రం ఎగరావచ్చు. రేపు విపక్ష సంకీర్ణమే అధికారంలోకి రావచ్చు. అందుకే ఈ ముందు జాగ్రత్త అనుకోవాలి. అనుమానం రాకుండా జాతీయ పత్రికలో మోదీ భజన.
జాతీయ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏలోని టీడీపీ పట్ల ఇదే స్నేహభావాన్ని ప్రదర్శిస్తుండటం కూడా గమనించదగ్గ విషయం. ఓట్‌చోరీ పైన ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న రాహుల్‌గాంధీ ఏపీ ఎన్నికల్లో జరిగిన ఓట్‌చోరీ పైన ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. శుక్రవారం నాడు ఓట్‌చోరీ అంశంపై ప్రతిపక్ష బృందం రాష్ట్రపతిని కలిసింది. ఆధారాలుంటే ఇవ్వాలని రాష్ట్రపతి తమతో చెప్పినట్లు రాహుల్‌గాంధీ మీడియాకు వెల్లడించారు.
బోగస్ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? రాత్రి 8 గంటల తర్వాత 52 లక్షల ఓట్లు పోలైనట్లు ప్రకటించడంలోని ఔచిత్యమేమిటన్న ప్రశ్నకు ఇప్పటిదాకా ఈసీ నుంచి సమాధానం లేదు. నాటి ఎన్నికల ప్రధానాధికారి పదిరోజుల్లోగానే వీవీ ప్యాట్లను ఎందుకు కాల్చేయమన్నారన్న ప్రశ్నకూ సమాధానం లేదు. పోలింగ్ రోజు తగ్గిన ఈవీయమ్ బ్యాటరీ కౌంటింగ్ నాటికి ఎలా పెరిగిందంటే జవాబు చెప్పే దిక్కులేదు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కేంద్రాల ముందు లక్షలాది మంది బారులు తీరి నిలబడ్డారని చెబుతున్న ఎన్నికల సంఘం ఆ వీడియో ఫుటేజిని ఎందుకు చూపెట్టడంలేదో తెలియదు. కానీ ఏపీలో జరిగిన బూటకపు ఎన్నికల గురించి రాహుల్ మాట్లాడరు. ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం అటువంటిది. చంద్రబాబు ‘ది హిందూ’లో రాసిన వ్యాసం కౌటిల్యంతో రాశారా? కనువిప్పు కలిగి రాశారా అన్న అంశాన్ని ఈ నేపథ్యంలోనే పరిశీలించాలి.
- వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.com
ఇదీ చదవండి: ‘నోబెల్ శాంతి’కి సరైన ఎంపిక


