రేవ్‌పార్టీ కేసులో ట్విస్ట్‌ | Tollywood Celebrities Caught At Bengaluru Rave Party Details | Sakshi
Sakshi News home page

బెంగళూరులో రేవ్‌పార్టీ కలకలం.. పట్టుబడ్డ టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖులు!

May 20 2024 10:39 AM | Updated on May 20 2024 2:34 PM

Tollywood Celebrities Caught At Bengaluru Rave Party Details

వందకు పైగా పట్టుబడగా.. అందులో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఉన్నట్లు..

బెంగళూరు, సాక్షి: నగరంలో వెలుగు చూసిన రేవ్‌ పార్టీలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు పక్కా సమాచారం అందుతోంది. వాళ్ల నుంచి బెంగళూరు నార్కొటిక్స్‌ విభాగం శాంపిల్స్‌ సేకరించగా.. అసలు ఈ రేవ్‌ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు బెంగళూరు పోలీసులు.

ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ కలకలం రేగింది. ఆదివారం అర్ధరాత్రి  బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించగా.. పోలీసులు దాడి చేశారు.  ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. పట్టుబడ్డ వాళ్లలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.సదరు జీఆర్‌ ఫామ్‌హౌస్‌ హైదరాబాద్‌‌ కాన్‌కార్డ్‌ సంస్థకు గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. 

హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు, విమానంలో యువతీయువకులను తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్‌ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. సుమారు 15 విలువైన కార్లను పోలీసులు సీజ్‌ చేశారు. రేవ్‌ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బెంగళూరు సీసీబీ పోలీసులు. 

ఆ కథనాల్ని ఖండించిన కాకాణి
రేవ్‌పార్టీలో దొరికిన ఓ కారుతో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్‌కు సంబంధం ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. బెంగళూర్‌ రేవ్‌ పార్టీలో దొరికిన కారుతో నాకు సంబంధం లేదు. కారుపై స్టిక్కర్‌ ​ఒరిజినాలా? ఫొటో కాపీనా? అనేది పోలీసులే తేలుస్తారు. 2023తో ఆ స్టిక్కర్‌ కాలపరిమితి ముగిసింది అని కాకాణి అన్నారు.

నాకు సంబంధం లేదు: సినీ నటి హేమ
‘‘నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సినీ నటి హేమ ప్రకటించారు. అయితే హేమ ప్రకటన చేసిన కాసేపటికే పోలీసులు ట్విస్ట్‌ ఇచ్చారు. ఆమె పార్టీలో పాల్గొందంటూ బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాజకీయ ప్రముఖులు సైతం
బెంగళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడ్డ వంద మందిలో 70 మంది పురుషులు, 30 మంది యువతులు ఉన్నారు. అయితే వీళ్లలో సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. వాసు అనే వ్యక్తి పేరు మీద ఈ పార్టీ జరగ్గా.. అసలు ఈ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పట్టుబడ్డ వాళ్ల నుంచి శాంపిల్స్‌ సేకరించే పనిలో ఉంది బెంగళూరు నార్కోటిక్స్‌ విభాగం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement