బాల్‌ కట్వా గ్యాంగ్‌ దాడులు.. పోలీసులకు సవాల్‌ | Hair Chopping Gang Creates Panic In Bihar, Cuts Women's Hair After House Robberies, More Details Inside | Sakshi
Sakshi News home page

బాల్‌ కట్వా గ్యాంగ్‌ దాడులు.. పోలీసులకు సవాల్‌

Jul 19 2026 7:51 AM | Updated on Jul 19 2026 12:28 PM

Hair Chopping Gang Creates Panic in Bihar

పాట్నా: అందరూ ఇంట్లో ఉండగానే చొరబడతారు. చాకచక్యంగా మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తారు. దొరికిన డబ్బు, నగలు దోచుకుని పరారవుతారు. అయితే వెళ్తూ వెళ్తూ ఇంట్లోని మహిళల జుట్టును కత్తిరించి తీసుకెళ్తుండటమే ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దొంగతనాల కేసులను ఛేదించడమే పోలీసులకు సవాలుగా ఉంటే, ఈ ‘జుట్టు కత్తిరించే’ గ్యాంగ్ మాత్రం వారికి కొత్త తలనొప్పిగా మారింది. బిహార్‌లో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

నిత్యం సోషల్ మీడియాలో ‘చడ్డీ గ్యాంగ్’, ‘షట్టర్ కట్వా గ్యాంగ్’ గురించి వింటుంటాం. ఇప్పుడు ‘బాల్ కట్వా గ్యాంగ్’ బిహార్ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వారం రోజుల వ్యవధిలో ఒకే గ్రామంలో రెండు చోట్ల ఒకే తరహాలో దోపిడీలు జరిగాయి. డబ్బు, నగలతో పాటు మహిళల జుట్టును కూడా కత్తిరించి తీసుకెళ్లడంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

దొంగలు ఎత్తుకెళ్లిన డబ్బు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వారు కత్తిరించి తీసుకెళ్లిన జుట్టును ఏం చేస్తున్నారనే ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. ఇదే స్థానికుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల బిహార్‌లోని దర్భంగా జిల్లా దర్హార్ గ్రామంలో రెండు వేర్వేరు ఇళ్లలో ఒకే తరహాలో దోపిడీలు జరిగాయి. జూలై 8న డాక్టర్ పవన్ కుమార్ మిశ్రా ఇంట్లోకి చొరబడ్డ ఐదుగురు అగంతకులు కుటుంబ సభ్యులను బంధించి, ఇంజెక్షన్ రూపంలో మత్తుమందు ఇచ్చారు. సుమారు 20 నిమిషాల్లో రూ.5 లక్షల విలువైన బంగారం, రూ.35 వేల నగదు దోచుకుని పరారయ్యారు. వెళ్లే ముందు పవన్ మేనకోడలు, 22 ఏళ్ల కరిష్మా దేవి జుట్టును కత్తిరించి తీసుకెళ్లారు.

అదే గ్రామంలో ఉపాధ్యాయుడు సుమన్ కుమార్ ఇంట్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో దోపిడీ చేసిన దుండగులు అక్కడ నిద్రిస్తున్న బాలిక జుట్టును కూడా కత్తిరించి తీసుకెళ్లారు. వరుస దోపిడీలపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. బాధిత కుటుంబాలను విచారించి, ఘటనాస్థలాలను పరిశీలించాయి. రెండు చోట్ల జరిగిన దోపిడీల తీరు ఒకే విధంగా ఉందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరోవైపు, దుండగులు మహిళల జుట్టును ఎందుకు కత్తిరించి తీసుకెళ్తున్నారన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దోపిడీల కంటే ఈ అంశమే స్థానికులను ఎక్కువగా కలవరపెడుతోంది. రెండు ఘటనల వెనుక ఒకే ముఠా ఉందా? జుట్టును తీసుకెళ్లడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

దర్హార్ గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భయంతో చాలా మంది గ్రామస్తులు రాత్రిళ్లు ఇళ్లకు కాపలా కాస్తూ మేల్కొని ఉంటున్నారు. అయితే నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement