నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యం

Aug 8 2026 1:35 AM | Updated on Aug 8 2026 1:35 AM

● కలెక్టరేట్‌లో జాతీయ చేనేత దినోత్సవం ● చేనేత కార్మికులకు సత్కారం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు డీఆర్వో మోహన్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పే చేనేత కళను కాపాడుతూ, ఈ రంగంపై ఆధారపడిన కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత అని కొనియాడారు. ఎటువంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే ఒక తరం నుంచి మరొక తరానికి ఈ నైపుణ్యాలు అందుతూ వస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని కార్వేటినగరం, నగరి, పెనుమూరు తదితర మండలాల్లో అనేక కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. యువత వారానికి ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరిస్తే నేతన్నలకు మెరుగైన ఉపాధి లభిస్తుందని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేనేత రంగంను ప్రోత్సహిస్తూ నేతన్న సేవలో పథకంలో ఒక్కొక్క కుటుంబానికి రూ.25 వేలు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. జిల్లాలో 252 మందికి ప్రయోజనం అందుతోందన్నారు. జిల్లాలో 1,223 మంది చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్‌ అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం చేనేత ర్యాలీని నిర్వహించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో చేనేత వస్త్ర ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన పలువురు చేనేత కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్‌ శాఖ అధికారి శైలజారాణి, నాయకులు కుప్పయ్యశెట్టి, షణ్ముగ వర్మ, బాలాజీ, కేశవులు శెట్టి తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న డీఆర్వో మోహన్‌ కుమార్‌ , చేనేత కార్మికుడిని సత్కరిస్తున్న డీఆర్వో మోహన్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement