చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై మూడు నెలలు గడిచిన తర్వాత ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఆన్‌లైన్‌లో డిగ్రీ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తూ షెడ్యూల్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 ప్రభుత్వ, 42 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలున్నాయి. ఈ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్‌కు సంబంధించి దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
అధికారుల అలసత్వం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధునాతన ల్యాబ్‌లు, అర్హత కలిగిన అధ్యాపకులు, నామమాత్రపు ఫీజులే అయినప్పటికీ విద్యార్థుల అడ్మిషన్ మాత్రం ఆశాజనకంగా ఉండడం లేదు. ఏటా అడ్మిషన్ల సంఖ్య పడిపోతున్నా కళాశాలల అధికారుల్లో చలనం రావడం లేదు. ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు ఇంటర్ విద్యార్థుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఆకర్షణీయమైన ఆఫర్లతో అడ్మిషన్లు పెంచుకుంటున్నారు., ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సిబ్బంది మాత్రం నామమాత్రంగా ప్రచారం చేసి చేతులు దులుపుకుంటున్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించడంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది.
తీరు మారుతుందా..?
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు. రూ.లక్షల వేతనాలు పొందుతున్న ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కనీస మాత్రం అడ్మిషన్ల ప్రక్రియను పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా వారు తీరు మార్చుకోవాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
కావాల్సిన సర్టిఫికెట్లు
డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ దరఖాస్తుకు 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల జాబితాలు,6 నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ కింద అయితే పీహెచ్, ఎన్‌సీ సీ, స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
షెడ్యూల్ వివరాలు ఇలా..
అధికారిక వెబ్‌సైట్ www.oamdcaprche. apcfrr.in వెబ్‌సైట్‌లో అడ్మిషన్ దరఖాస్తుకుఅవకాశం కల్పించారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈ నెల 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 12,13 తేదీల్లో ప్రత్యేక కేటగిరీల పరిశీలన, ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్‌లు, 20వ తేదీన ఆప్షన్ల సవరణ, సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 26న సీట్ల కేటాయింపు, 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని షెడ్యూల్‌లో పేర్కొన్నారు.


