సచివాలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

సచివాలయంలో చోరీ

Aug 9 2026 1:40 AM | Updated on Aug 9 2026 1:40 AM

గుడిపాల : మండలంలోని వసంతాపురం సచివాలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సచివాలయం తలుపులు పగులగొట్టి రెండు సీసీ కెమెరాలను అపహరించారు. దీంతో మూడు బీరువాలను తెరిచి రికార్డులను చెల్లా చెదురు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఎదుటే ఉన్న చికెన్‌ సెంటర్‌కు వెళ్లి మూడు లింగాపురం కోళ్లతో పాటు సిలిండర్‌ను చోరీ చేశారు. ఇదే సచివాలయంలో 2026 ఫిబ్రవరి 10వ తేదీన ప్రింటర్లను అపహరించారు. సమీపంలోని మహాభారతం గుడి తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. అయితే అక్కడ ఏమీ లేకపోవడంతో వెళ్లిపోయారు. పోలీస్‌స్టేషన్‌ దగ్గరే వరుస చోరీలు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

కిక్కిరిసిన కాణిపాకం

కాణిపాకం : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శనివారం సెలవు రోజు కావడంతో వేకువ నుంచే పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూలు కిటకిటలాడాయి. స్వామివారి ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం లైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. ఆలయ అధికారులు, పోలీ సులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కత్తితో దాడిపై కేసు నమోదు

గంగవరం : మండలంలోని బొమ్మనపల్లెలో కత్తితో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాలు.. గ్రామానికి చెందిన గట్టప్ప, ముని వెంకటప్పకు మధ్య వారం నుంచి గొడవలు జరుగుతున్నాయి. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వారిని పోలీసులు మందలించి పంపించారు. దీనిపై కక్ష పెంచుకున్న గట్టప్ప శుక్రవారం రాత్రి మునివెంకటప్ప(63)పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో మునివెంకటప్ప తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు వెంటనే పలమనేరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయాల్లో చోరీ

కుప్పం : మండలంలోని గోనుగూరు, పరమసముద్రం, పలార్లపల్లెలోని ఆలయాల్లో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పరమసముద్రంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో హుండీ పగులగొట్టి 4 కేజీల వెండి 10 గ్రాముల బంగారు నగలు అపహరించినట్లు పూజారి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో రెండు ఆలయాల్లో ఏం చోరీ చేశారో తెలియాల్సి ఉంది.

గంజాయి ముఠా అరెస్ట్‌

పుత్తూరు: పట్టణంలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న ఆరుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement