తిరుపతి సిటీ: రాష్ట్రంలో దళితులపై దాడులతో చెలరేగిపోతున్న చంద్రబాబు సర్కారు చివరికి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా పట్ల కూడా వివక్ష చూపించి, అవమానించిందని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ వంటి అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తికి కూడా టీటీడీ అధికారులు కనీస గౌరవం ఇవ్వలేదని, ప్రొటోకాల్ పాటించలేదని చెప్పారు. చైర్మన్‌ను ఎక్కడో చివరకు నెట్టేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీల పట్ల వివక్షకు ఇంతకంటే నిదర్శనం ఉండదన్నారు. టీటీడీలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తీవ్ర విక్షకు గురవుతున్నారని మండిపడ్డారు. వారికి పదోన్నతులు సక్రమంగా ఇవ్వడంలేదని, చిన్న వ్యాపార అవకాశాల విషయంలో కూడా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఉద్యోగుల పదోన్నతుల జాబితాను పరిశీలిస్తే వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. పది వేలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా ఉద్యోగులపై అదనపు పని భారం మోపుతున్నారని తెలిపారు. టీటీడీలో జరిగే సమావేశాలకు ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులను ఆహ్వానించడంలేదన్నారు. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో నిరంతరం పోరాటం చేస్తున్నామని చెప్పారు.


