చిత్తూరు కలెక్టరేట్ : వికసిత్ భారత్‌జీ రామ్‌జీ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల ఉపాధి కల్పించనున్నట్లు డ్వామా పీడీ రవికుమార్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డ్వామా కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధిని సాధించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామానికి ఎంతగానో ఉపయోగపడే చెరువుల పూడిక తీత, రహదారుల నిర్మాణం, పంట కాలువల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, నీటి నిల్వ నిర్మా ణాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పథకం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామసభల నిర్వహించి ఆ సమాచారంతో సరైన నిర్ణయాలు తీసుకునేలా స్థానిక వ్యవస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. సామాజిక తనిఖీలతో పారదర్శకత, జవాబుదారీతనం ప్రజా భాగస్వామ్యంతో సమర్థవంతమైన పాలన అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గ్రామాల పురోగతికి అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన సదస్సులో ఏపీడీ సునీల్ కుమార్, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, డ్వామా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


