కోట్లు ఉన్నా కొరత భావనేనా? | Why India Millionaire Parents Still Poverty Mindset | Sakshi
Sakshi News home page

కోట్లు ఉన్నా కొరత భావనేనా?

Jul 15 2026 8:39 AM | Updated on Jul 15 2026 9:03 AM

Why India Millionaire Parents Still Poverty Mindset

ఆర్థికంగా ఎంత సంపాదించినా, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నా.. నేటికీ చాలా మంది ధనిక భారతీయ తల్లిదండ్రులు తమ పాత ‘పేదరిక మనస్తత్వం’ (పావర్టీ మైండ్‌సెట్‌) నుంచి బయటపడలేకపోతున్నారు. గతంలో తాము పడ్డ కష్టాలను, ఆనాటి పరిస్థితులను నేటి పిల్లలపై బలవంతంగా రుద్దడం, ఆ కష్టాలను గొప్పగా కీర్తించడం వల్ల పిల్లల సృజనాత్మకత, భవిష్యత్తు ఎదుగుదల తీవ్రంగా దెబ్బతింటున్నాయని సామాజిక మాధ్యమాల్లో ఒక సరికొత్త చర్చ రేకెత్తింది. ఎక్స్‌ వేదికగా శంతను అనే యూజర్ పంచుకున్న ఒక సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మిలియనీర్లుగా ఎదిగినప్పటికీ వారి ఆలోచనా విధానంలో మాత్రం ఇంకా పేదరిక మనస్తత్వం అలాగే ఉండిపోయిందని విశ్లేషించారు.

కష్టాలను కీర్తించడం ఆపండి

మన దేశంలో చాలా మంది తల్లిదండ్రులు తాము చిన్నప్పుడు ఎంత కష్టపడ్డారో, ఎలా చదువుకున్నారోనని పదే పదే చెబుతుంటారు. ‘మేము ఆ రోజుల్లో ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాం. ఒక్క పూటే తిని చదువుకున్నాం’ అంటూ గత కాలపు కష్టాలను ఒక గొప్ప విషయంగా చెబుతుంటారు. అయితే, ఈ రోజుల్లో అలాంటి వనరుల కొరత లేకపోయినా.. పిల్లలకు ఆధునిక వసతులను అందుబాటులో ఉంచకుండా వారిని కూడా అదే రీతిలో ఇబ్బంది పెట్టాలని చూడటం ఏమాత్రం సమర్థనీయం కాదని శంతను పేర్కొన్నారు.

పెట్టుబడి పెట్టేందుకు వెనుకడుగు

ఈ మనస్తత్వానికి సంబంధించి ఆయన కొన్ని ప్రధాన అంశాలను ఎత్తిచూపారు. ‘వ్యాపారాల కోసం కోట్లాది రూపాయల టర్నోవర్ చేసే తల్లిదండ్రులు సైతం పిల్లల ఉత్పాదకతను (Productivity) పెంచే కొన్ని వందల రూపాయల విలువైన పెయిడ్ సాఫ్ట్‌వేర్ యాప్‌లు లేదా ఆన్‌లైన్ టూల్స్ కొనుగోలు చేయడానికి వెనుకాడుతుంటారు. సంపద ఉన్నప్పటికీ ఖరీదైన ఆరోగ్యకరమైన ఆహారం లేదా సమతుల్య పోషకాహారం తీసుకోవడానికి బదులు.. పాత పద్ధతులనే పాటిస్తూ డయాబెటిస్, విటమిన్ లోపాలు వంటి అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గమ్యస్థానాన్ని త్వరగా చేరుకోవడానికి విమాన ప్రయాణం చేసే స్తోమత ఉన్నా డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో గంటల కొద్దీ రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతారు. సమయం కంటే డబ్బే ముఖ్యం అనుకునే ఈ ధోరణి పిల్లల విలువైన సమయాన్ని వృధా చేస్తోంది’ అని శంతను చెప్పారు.

పిల్లల ఆత్మవిశ్వాసంపై దెబ్బ

ఈ ‘పేదరిక మనస్తత్వం’ అనేది కేవలం డబ్బు దాచుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా పిల్లల ఆలోచనా పరిధిని కూడా కుంచించుకుపోయేలా చేస్తోంది. ఆర్థిక భద్రత ఉన్నప్పటికీ నిరంతరం అభద్రతా భావంతో బతకడం వల్ల పిల్లలు కొత్త ప్రయోగాలు చేయడానికి, స్టార్టప్‌లు ప్రారంభించడానికి లేదా రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు.

మారుతున్న కాలంతో పాటు తల్లిదండ్రుల ఆలోచనలు కూడా మారాలి. కష్టం విలువను పిల్లలకు నేర్పించడం అవసరమే, కానీ దానిని మానసిక వేధింపుగా మార్చకూడదు. ఆర్థిక విజయాలు సాధించినప్పుడు ఆ విజయాల ఫలాలను తదుపరి తరానికి అందించి వారిని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలే తప్ప.. గత కాలపు ఇబ్బందులను వారిపై రుద్ది వారి రెక్కలను కత్తిరించకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: బ్రాండ్ రేస్‌లో దేశీయ దిగ్గజాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement