రూ. 21,000 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన ఫర్నీచర్ రిటైల్ దిగ్గజం ఐకియా భారత్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా 2030 నాటికి, ముందుగా నిర్దేశించుకున్న దానికి రెట్టింపు స్థాయిలో, రూ. 21,000 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. స్థానికంగా కొనుగోళ్లను, స్టోర్స్‌ను పెంచుకోవడంతో పాటు రూ. 8,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఐకియా ఇండియా సీఈవో ప్యాట్రిక్ ఆంటోనీ ఈ విషయాలు తెలిపారు. భారత్‌లో రిటైల్ కార్యకలాపాలకు 2013లో అనుమతులు లభించినప్పుడు ఐకియా రూ. 10,500 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతం దానికి రెట్టింపు స్థాయిలో ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు ఆంటోనీ పేర్కొన్నారు. స్టోర్స్ ఏర్పాటు, రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, టెక్నాలజీ సామర్థ్యాలను పెంచుకోవడం మొదలైన వాటిపై పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. ప్రస్తుతం రూ. 2,000 కోట్లుగా ఉన్న టర్నోవరును 2030 నాటికి రూ. 8,000 కోట్లకు పెంచుకోవాలనేది లక్ష్యమని ఆంటోనీ వివరించారు. 2030 నాటికి స్టోర్స్ సంఖ్య 30కి చేరుకుంటుందని చెప్పారు. ఇప్పుడు 2,500 మంది ఉద్యోగులు ఉండగా, మరో 2,500 మంది సిబ్బందిని తీసుకోనున్నట్లు తెలిపారు. 2018లో హైదరాబాద్‌లో తొలి స్టోర్ ప్రారంభించిన ఐకియాకి ప్రస్తుతం బెంగళూరు, ముంబైలో లార్జ్ ఫార్మాట్ స్టోర్స్ ఉన్నాయి.


