హై బేస్ ఎఫెక్ట్, వాహనాల ధరల పెంపుతో సవాళ్లు
ఎఫ్‌వై 27 లో ద్విచక్ర వాహన హోల్‌సేల్స్ వృద్ధి 3–5 శాతమే
సప్లై చైన్‌కు పశ్చిమాసియా ఉద్రిక్తతల ముప్పు
మార్కెట్లో దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ వాహనాలు
తాజా నివేదికలో రేటింగ్స్ సంస్థ ‘ఇక్రా’ వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై 2027) లో 3–5 శాతం పరిమిత హోల్‌సేల్ వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్స్ సంస్థ ‘ఇక్రా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఎల్‌నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడే సూచనలు, ద్రవ్యోల్బణంతో వాహనాల ధరలు పెరగడం, గత ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన అత్యధిక విక్రయాల ప్రభావం (హై బేస్ ఎఫెక్ట్) వంటి అంశాలు ఈ రంగానికి సవాళ్లుగా మారొచ్చని రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది.
సానుకూలతలున్నా.. అంతర్జాతీయ సవాళ్లు పెరుగుతున్న దేశీయ డిమాండ్, మెరుగైన రిటైల్ విక్రయాల జోరు, నిలకడైన ఎగుమతుల మద్దతుతో ద్విచక్ర వాహన రంగం తన నిలకడైన ప్రదర్శనను చాటుకుంటోందని ఇక్రా పేర్కొంది. ‘జీఎస్టీ 2.0’ సంస్కరణలతో వాహనాలు అందుబాటు ధరల్లోకి రావడం, పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ధోరణి మార్కెట్ వృద్ధికి సానుకూలంగా మారనున్నాయి. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సప్లై చైన్‌ను దెబ్బతీసే అవకాశం ఉన్నందున, ఆ పరిణామాలను క్షుణ్ణంగా గమనించాల్సి ఉంటుందని తెలిపింది.
మేలో విక్రయాల జోరు
దేశీయ హోల్‌సేల్ విక్రయాలు 2026 మే నెలలో వార్షిక ప్రాతిపదికన 15.7 శాతం బలమైన వృద్ధితో 19 లక్షల యూనిట్లకు చేరాయని ఇక్రా నివేదిక తెలిపింది. జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాహన తయారీ కంపెనీలు ధరలు పెంచుతారనే ముందస్తు అంచనాలతో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఇందుకు కారణమైంది. ఇక రిటైల్ విక్రయాలు కూడా మే నెలలో ఏడాది ప్రాతిపదికన 7.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పెళ్లిళ్ల సీజన్, ఎంట్రీ–లెవెల్ నుంచి ప్రీమియం శ్రేణి వరకు విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. అయితే, దేశంలో నమోదైన విపరీతమైన ఎండల కారణంగా షోరూమ్‌లకు కస్టమర్ల రాక తగ్గడం, కొన్ని మోడళ్ల సరఫరాలో అంతరాయాలు వృద్ధి వేగాన్ని కొంతమేర నియంత్రించాయి.
ఈ–టూ వీలర్స్ దూకుడు
ఇక్రా నివేదికలో ఎలక్ట్రిక్ వాహన విభాగ ప్రదర్శన ఆకట్టుకుంది. 2026 మే నెలలో రిటైల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏకంగా 71.7 శాతం వార్షిక వృద్ధితో 1,72,148 యూనిట్లకు చేరాయి. మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఈవీల వాటా ప్రస్తుతం 8.9 శాతానికి చేరింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణకు, మారుతున్న పర్యావరణ వ్యవస్థకు ఇది నిదర్శనమని ఇక్రా స్పష్టం చేసింది.


