ఆర్‌బీఐ బాటలోనే బ్యాంక్‌లు | several banks reduced their lending rates following the RBI repo rate cut | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ బాటలోనే బ్యాంక్‌లు

Jun 9 2025 8:53 AM | Updated on Jun 9 2025 8:53 AM

several banks reduced their lending rates following the RBI repo rate cut

హెచ్‌డీఎఫ్‌సీ, బీవోబీ, పీఎన్‌బీలు తగ్గింపు

ఆర్‌బీఐ నిర్ణయానికి అనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ తన మార్జినల్‌ కాస్ట్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) 10 బేసిస్‌ పాయింట్లు (0.10 శాతం) తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జూన్‌ 7 నుంచే ఈ సవరణ అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.

తాజా తగ్గింపుతో ఓవర్‌నైట్, ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు 8.90 శాతానికి దిగొచ్చాయి. మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు సైతం 0.10 శాతం తగ్గి 8.95 శాతానికి పరిమితమైంది. ఆరు నెలలు, ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ 0.10 శాతం తగ్గి 9.05 శాతంగా ఉంది. రెండు, మూడేళ్ల కాల ఎంసీఎల్‌ఆర్‌ 9.20 శాతం నుంచి 9.10 శాతానికి తగ్గినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. ప్రభుత్వరంగ బీవోబీ సైతం రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను 0.50 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

ఇదీ చదవండి: ఎఫ్‌పీఐల యూటర్న్‌ 

దీంతో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 8.15 శాతానికి తగ్గింది. జూన్‌ 7 నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రెపో రేటును అర శాతం తగ్గిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా రుణ గ్రహీతలకు బదిలీ చేసినట్టు బీవోబీ ప్రకటించింది. పీఎన్‌బీ సైతం ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు, ఇది ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో గృహ రుణ రేటు 7.45 శాతం నుంచి ప్రారంభం కానుంది.   

Advertisement
 
Advertisement
Advertisement