వెండి సైతం రూ. 5,300 డౌన్
ఫెడ్ నిర్ణయాల ముందు అప్రమత్తత
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన పవనాలు, బలమైన రూపాయి వెరసి పసిడి, వెండి బుధవారం భారీగా నష్టపోయాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.4,800 తగ్గి రూ.1,54,400 స్థాయికి దిగొచ్చింది. వెండి సైతం కిలోకి రూ.5,300 నష్టపోయి రూ.2,55,400 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన పనితీరు నేపథ్యంలో వరుసగా రెండో రోజు దేశీ బులియన్ మార్కెట్లో బలహీన ధోరణి నెలకొన్నట్టు విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ముఖ్యంగా కొత్త చైర్మన్ కెవిన్ వార్‡్ష సారథ్యంలో యూఎస్ ఫెడ్ తొలి సమావేశం వివరాలు బుధవారం విడుదల కానున్నాయి.
వడ్డీ రేట్లపై కొత్త చైర్మన్ వ్యాఖ్యలు ఎలా ఉంటాయన్నది ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. బుధవారం రాత్రి (భారత కాలమానం) యూఎస్ ఫెడ్ నిర్ణయాలు వెల్లడి కానుండడంతో బంగారం ధర స్పాట్ మార్కెట్‌లో స్థిరీకరణను చూసినట్టు మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్‌సింగ్ తెలిపారు. ముఖ్యంగా యూఎస్–ఇరాన్ ఇంకా ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉన్న విషయం గమనార్హం.
వచ్చే శుక్రవారం ఇది చోటు చేసుకుంటుందని అంచనా. ఈలోపు ఎలాంటి పరిణామాలు ఉంటాయేమోనన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. ఔన్స్ బంగారం ధర 4,396 డాలర్లు, వెండి ధర 71.5 డాలర్ల వద్ద ఉన్నాయి.


