‘క్లాడ్ ఫేబుల్ 5’ను విడుదల చేసిన ఆంత్రోపిక్! | Anthropic Launches Claude Fable 5 AI That Could Hack Any Software | Sakshi
Sakshi News home page

‘క్లాడ్ ఫేబుల్ 5’ను విడుదల చేసిన ఆంత్రోపిక్!

Jun 10 2026 8:02 AM | Updated on Jun 10 2026 9:01 AM

Anthropic Launches Claude Fable 5 AI That Could Hack Any Software

ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ఆంత్రోపిక్ తన శక్తివంతమైన, అత్యాధునిక ‘మైథోస్’ క్లాస్‌కు చెందిన మొదటి మోడల్ ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5)ను ఓపెన్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సైంటిఫిక్ రీసెర్చ్, కాంప్లెక్స్ నాలెడ్జ్ వర్క్ వంటి రంగాల్లో అత్యంత అసాధారణమైన సామర్థ్యాలు ఉన్న ఈ మోడల్ భద్రతాపరంగా కొన్ని కఠినమైన పరిమితులతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

గతంలో ఆంత్రోపిక్ సంస్థ ‘మైథోస్’ ప్రివ్యూను ప్రకటించినప్పుడు ఇది ప్రపంచంలోని ఏ సాఫ్ట్‌వేర్‌నైనా హ్యాక్ చేయగల శక్తివంతమైనదని పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సైబర్ సెక్యూరిటీ ముప్పుపై భారతదేశంతో సహా పలు ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా సైతం సైబర్ దాడుల ప్రణాళికల కోసం మైథోస్‌ను ఉపయోగిస్తోందనే నివేదికలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి. ఈ తీవ్రమైన భద్రతా సవాళ్లను అధిగమిస్తూ గరిష్ట రక్షణ వలయాలతో ఆంత్రోపిక్ ఈ సరికొత్త మోడల్‌ను రంగంలోకి దించింది.

క్లాడ్ ఫేబుల్ 5 అంటే ఏమిటి? దీని ప్రత్యేకతలేంటి?

ఆంత్రోపిక్ వెల్లడించిన వివరాల ప్రకారం ‘క్లాడ్ ఫేబుల్ 5’ అనేది ఇప్పటివరకు కంపెనీ సాధారణ వినియోగదారుల కోసం విడుదల చేసిన మోడళ్లన్నింటికంటే అత్యంత సమర్థవంతమైనది.

అసాధారణ పనితీరు: సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, క్లిష్టమైన విశ్లేషణాత్మక పనుల్లో ఇది అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంది. కొన్ని అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ల్లో ఇది కంపెనీ ప్రస్తుత టాప్ మోడల్ ‘క్లాడ్ ఓపస్ 4.8’ కంటే 10 శాతం ఎక్కువ స్కోరు సాధించింది.

జైల్‌బ్రేక్ రక్షణ: మోడల్ విడుదలకు ముందు కంపెనీ అంతర్గతంగా 1,000 గంటలకు పైగా ‘బగ్ బౌంటీ’ పరీక్షలను నిర్వహించింది. అలాగే ‘రెడ్-టీమింగ్’ సంస్థల ద్వారా కూడా పరీక్షించగా ఎక్కడా ఈ మోడల్ భద్రతా వలయాన్ని చేధించే లూప్‌హోల్స్ కనిపించలేదని స్పష్టం చేసింది.

టాస్క్ కాంప్లెక్సిటీ: పని ఎంత సుదీర్ఘంగా, ఎంత సంక్లిష్టంగా ఉంటే ఇతర మోడళ్లతో పోలిస్తే ఫేబుల్ 5 అంతటి మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఆంత్రోపిక్ తెలిపింది.

అత్యంత కఠినమైన భద్రతా చర్యలు

మైథోస్ క్లాస్ మోడళ్ల వల్ల సైబర్ సెక్యూరిటీ, బయోలాజికల్, కెమికల్ రంగాల్లో ముప్పు పొంచి ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఆంత్రోపిక్ ఈ మోడల్‌లో వినూత్నమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పింది.

ఫాల్‌బ్యాక్ మెకానిజం

ఒకవేళ వినియోగదారు ఎవరైనా రిసిన్(ఒక రకమైన ప్రాణాంతక విషం) ఎలా తయారు చేయాలి? వంటి అత్యంత ప్రమాదకరమైన ప్రశ్నలను అడిగితే ఫేబుల్ 5 ఆ ప్రశ్నను బ్లాక్ చేస్తుంది. వెంటనే ఆ సెషన్ సురక్షితమైన ‘క్లాడ్ ఓపస్ 4.8’ మోడల్‌కు బదిలీ అవుతుంది. తద్వారా హానికరమైన సమాచారం బయటకు రాకుండా అడ్డుకుంటుంది. ఇలాంటి రక్షణల వల్ల దాదాపు 95 శాతం సెషన్లు పూర్తిగా ఫేబుల్ 5 లోనే నడుస్తాయని, కేవలం 5 శాతం లోపు అత్యంత సున్నితమైన కేసుల్లో మాత్రమే ఓపస్ 4.8 కి ట్రాన్స్‌ఫర్‌ అవుతాయని కంపెనీ స్పష్టం చేసింది.

చైనా వ్యూహాలకు బ్రేక్

చైనాకు చెందిన కొన్ని ఏఐ కంపెనీలు తమ సొంత మోడళ్లకు శిక్షణ ఇచ్చుకోవడానికి క్లాడ్ మోడల్‌ను డిస్టిలేషన్‌ (పెద్ద మోడల్ డేటా ఆధారంగా చిన్న మోడళ్లను తయారు చేయడం) చేస్తున్నాయని ఆంత్రోపిక్ గతంలో ఆరోపించింది. అయితే, ఫేబుల్ 5 లో పొందుపరిచిన యాంటీ-డిస్టిలేషన్ రక్షణలు ఇలాంటి మేధోసంపత్తి చౌర్యానికి అడ్డుకట్ట వేయనున్నాయి.

మైథోస్ 5, గ్లాస్ స్వింగ్ ప్రాజెక్ట్

ఫేబుల్ 5 తో పాటు ఆంత్రోపిక్ సైబర్ డిఫెండర్లు, కీలక మౌలిక సదుపాయాలు అందించేవారికోసం ‘క్లాడ్ మైథోస్ 5’ ను కూడా పరిమితంగా అందుబాటులో ఉంచింది. ‘ప్రాజెక్ట్ గ్లాస్ స్వింగ్’ ద్వారా ఇప్పటికే అనుమతి పొందిన సంస్థలు మాత్రమే దీనిని వాడగలవు. ఫేబుల్ 5 లాగే ఇది కూడా ఒకే అంతర్గత మోడల్‌ను కలిగి ఉన్నప్పటికీ ఇందులో భద్రతాపరమైన పరిమితులు (రక్షణలు) ఎత్తివేశారు. సైబర్ రక్షణ పరిశోధనల కోసమే దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ చెప్పింది.

ఎవరికి అందుబాటులో?

క్లాడ్ ఫేబుల్ 5 ప్రస్తుతం క్లాడ్ ఏపీఐ, యూజర్‌-ఆధారిత ఎంటర్‌ప్రైజ్ ప్లాన్‌ల ద్వారా అందుబాటులోకి వచ్చింది. సబ్‌స్క్రిప్షన్ ఆధారిత వినియోగదారుల కోసం ఇది దశలవారీగా విడుదల కానుంది. జూన్ 22 వరకు అదనపు ఖర్చు లేకుండా ప్రో, మాక్స్, టీమ్, ఎంటర్‌ప్రైజ్ ప్లాన్‌ల వారికి అందుబాటులో ఉంటుంది. జూన్ 23 నుంచి స్టాండర్డ్ ప్లాన్‌ల నుంచి తొలగిస్తారు. తర్వాత యూజర్‌ సామర్థ్యం ఆధారంగా యూసేజ్‌ క్రెడిట్లు అవసరమవుతాయి.

ఇదిలాఉండగా, మానవ ప్రమేయం లేకుండానే ఏఐ తనను తాను మరింత శక్తివంతంగా మార్చుకునే ప్రమాదం ఉందని, అందువల్ల గ్లోబల్ ఏఐ ల్యాబ్‌లు అన్నీ కలిసి ఈ ఫ్రాంటియర్ ఏఐ అభివృద్ధిపై నియంత్రణ కలిగి ఉండాలని ఆంత్రోపిక్ పిలుపునివ్వడం గమనార్హం.

ఇదీ చదవండి: కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం!

Advertisement
 
Advertisement
Advertisement