‘ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్’ కింద ఎంపిక చేసిన భారతీయ సంస్థలకు యాక్సెస్
సైబర్ భద్రత బలోపేతానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అవకాశం
అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ వ్యవస్థలపై హెచ్చరికలు
న్యూఢిల్లీ: అమెరికా చెందిన కృత్రిమ మేధ(ఏఐ) పరిశోధనా సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ‘మైథోస్’ ఏఐ మోడల్‌ను వినియోగించే అవకాశం కొన్ని భారతీయ సంస్థలకు లభించింది. ఆంథ్రోపిక్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్’ విస్తరణలో భాగంగా భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఈ యాక్సెస్‌ను పొందినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ మోడల్‌కు యాక్సెస్ పొందిన దేశీయ సంస్థల సంఖ్య పదిలోపే ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా సంస్థల పేర్లను వెల్లడించలేదు.
‘ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్’ అంటే
సైబర్ భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంథ్రోపిక్ చేపట్టిన కార్యక్రమమే ‘ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్’. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన సంస్థలకు ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అధునాతన ‘క్లాడ్ మైథోస్ ప్రివ్యూ’ ఏఐ మోడల్‌కు యాక్సెస్ కలి్పస్తోంది. సాఫ్ట్‌వేర్‌లలోని క్లిష్టమైన భద్రతా లోపాలు, జరగబోయే సైబర్ ముప్పులను గుర్తించడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏప్రిల్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు సుమారు 50 భాగస్వామ్య సంస్థలకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. ఈ మోడల్ సాయంతో ఆయా సంస్థలు వివిధ కోడ్‌బేస్‌లలో 10 వేలకుపైగా అధిక లేదా అత్యంత తీవ్ర స్థాయి భద్రతా లోపాలను గుర్తించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది.
సైబర్ భద్రత కోసం అంతర్జాతీయ విస్తరణ
తాజాగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తూ భారత్‌తో పాటు 15కుపైగా దేశాల్లోని 150 సంస్థలను భాగస్వాములుగా చేర్చింది. వీటిలో విద్యుత్, నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్, హార్డ్‌వేర్ రంగాలకు చెందిన కీలక మౌలిక వసతుల నిర్వాహక సంస్థలు ఉన్నాయి. సైబర్ దాడి జరిగితే కొన్ని సందర్భాల్లో 10 కోట్ల మందికిపైగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న సంస్థలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ఈ యాక్సెస్ ద్వారా భాగస్వామ్య సంస్థలు తమ డిజిటల్ మౌలిక వసతుల్లోని భద్రతా లోపాలను ముందే గుర్తించడం, రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌ల అమలును వేగవంతం చేయడం వంటి చర్యలు చేపట్టగలవు.


