డిజిటల్‌ మోసాలపై కలసికట్టుగా పోరాడుదాం | Airtel urges RBI, NPCI and banks to collaborate on digital fraud fight | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ మోసాలపై కలసికట్టుగా పోరాడుదాం

Jun 9 2025 6:04 AM | Updated on Jun 9 2025 8:02 AM

Airtel urges RBI, NPCI and banks to collaborate on digital fraud fight

బ్యాంక్‌లు, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐకి ఎయిర్‌టెల్‌ పిలుపు 

అవగాహన, శిక్షణ కార్యక్రమాల పట్ల సంసిద్ధత 

న్యూఢిల్లీ: డిజిటల్‌ మోసాలను అరికట్టేందుకు కలసికట్టుగా పోరాడుదామంటూ 40కి పైగా బ్యాంక్‌లు, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐని ఎయిర్‌టెల్‌ కోరింది. మోసపూరిత డొమైన్‌ల సమాచారంతో రిపాజిటరీ ఏర్పాటు చేయడంతోపాటు సన్నిహిత సహకారానికి పిలుపునిచ్చింది. హానికారక, మోసపూరిత వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసే విషయంలో కలసి పనిచేద్దామని కోరుతూ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)కు రాసిన లేఖలో ఎయిర్‌టెల్‌ కోరింది.

 బహుళ అంచల రక్షణ కవచం ఏర్పాటు ద్వారా డిజిటల్‌ మోసాలపై పోరాడుదామని కోరింది. డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను మరింత భద్రంగా మార్చే విషయంలో ఎన్‌పీసీఐ, ఎయిర్‌టెల్‌ మధ్య భాగస్వామ్యానికి బలమైన అవకాశాలున్నట్టు పేర్కొంది. మోసాలను గుర్తించి, వాటిని అడ్డుకునేందుకు ఎయిర్‌టెల్‌ అమలు చేస్తున్న చర్యలను ప్రస్తావించింది. 

హానికారక వెబ్‌సైట్లు, ఫిషింగ్‌ లింక్‌ల యాక్సెస్‌ను బ్లాక్‌ చేయడం ద్వారా యూజర్ల రక్షణ చర్యలు అమలు చేస్తున్నట్టు తెలిపింది. ఇదే మాదిరి ఆర్‌బీఐకి సైతం ఎయిర్‌టెల్‌ లేఖ రాసింది. నియంత్రణ పరమైన సంప్రదింపుల పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలియజేసింది. వినియోగదారుల రక్షణ (మఖ్యంగా ఆర్థిక సమాచారం) విషయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను జవాబుదారీ చేసే కార్యాచరణ విషయంలో సహకారం అందిస్తానంటూ ఆర్‌బీఐకి ఎయిర్‌టెల్‌ తెలియజేసింది.

 డిజిటల్‌ మోసాలు, రక్షణ చర్యలపై ఉమ్మడి అవగాహన ప్రచార, శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మోసాల నివారణకు ఉమ్మడిగా కలసి పనిచేద్దామంటూ ఎయిర్‌టెల్‌ లోగడ పోటీ టెలికం కంపెనీలైన జియో, వొడాఫోన్‌ ఐడియాలకు సైతం విడిగా కోరడం గమనార్హం. 2024 మొదటి తొమ్మిది నెలల్లో 1.7 మిలియన్‌ సైబర్‌ మోసాల రూపంలో వినియోగదారులు రూ.11,000 కోట్లు నష్టపోయినట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement