సాక్షి, ఢిల్లీ/అమరావతి: వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. మాములు పొలిటికల్ డ్రామాలాడలేదు. ‘చెల్లని’ జీవోలు ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకున్నారు. అయితే బాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేయగా, ఆ తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో నారా పొలిటికల్ డ్రామాపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. చంద్రబాబు కూడా ఇటీవల రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయినా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రాన్ని ఒప్పించేందుకు కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలిసినా చంద్రబాబు ఈ దిశగా ఎందుకు ప్రయత్నించలేదని నిలదీస్తున్నాయి. అసలు ప్రధానితో చంద్రబాబు కనీసం దీని గురించి మాటైనా ప్రస్తావించారా? అని అంటున్నాయి.
షెడ్యూల్-9 డిమాండ్ ఉందిగా..
బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని కేంద్రం ద్వారా పరిష్కరించాలని, ఇందుకోసం సంబంధిత చట్టాన్ని తీసుకొచ్చి షెడ్యూల్-9లో చేర్చాలని బీసీ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై చట్టపరమైన పరిమితులు ఉన్నాయని తెలిసి కూడా 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారా? సాధ్యం కాదని తెలిసినా చెల్లని జీవోలతో నాటకమాడారా? అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
గతంలోనూ ఇదే తీరంటూ ఆగ్రహం
బీసీల రిజర్వేషన్ల విషయంలో టీడీపీ గతంలోనూ అడ్డంకులు సృష్టించడం.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఆనాడు టీడీపీ నేత ప్రతాప్‌తో పిటిషన్లు వేయించి రిజర్వేషన్లను అడ్డుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చట్టం దిశగా అడుగులేయకుండా చెల్లని జీవోలు ఇచ్చారని మండిపడుతున్నారు.
బీసీలను మరోసారి మోసం చేశారని, చంద్రబాబు తీరు వెన్నుపోటు లాంటిదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై ప్రధానితో చంద్రబాబు చర్చించారా? కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారా? అని నిలదీస్తున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేకపోతే ఆ కూటమిలో కొనసాగడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు చేసిన రాజకీయ నాటకమేనని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ సర్వేను తప్పుబట్టిన సుప్రీం కోర్టు


