సాక్షి, తాడేపల్లి: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. సిట్ చీఫ్, ఐజీ ఎం. రవిప్రకాష్‌కు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సాయికృష్ణ కేసు దర్యాప్తులో లోపాలు, అనేక అనుమానాస్పద అంశాలను ప్రస్తావించిన అంబటి.. రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు స్పష్టంగా లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. హత్య ఎలా జరిగింది? మొదలు.. ప్రతీ కీలక ప్రశ్నకూ సరైన సమాధానం లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారాయన.
టాస్క్‌ఫోర్స్, కృష్ణలంక పోలీస్‌స్టేషన్, పైస్థాయి అధికారుల పాత్ర ఉన్నప్పటికీ క్రిమినల్ లయబిలిటీని(బాధ్యత) కేవలం ఒక సీఐకే పరిమితం చేయడం సరికాదని అంబటి తన లేఖలో విమర్శించారు. సాయికృష్ణను హ్యాండోవర్ చేసిన సమయంలో రాతపూర్వక అకాలెడ్జ్‌మెంట్ ఉన్నప్పటికీ కస్టడీ విషయాన్ని సీఐ మాత్రమే దాచాడని చెప్పడం నమ్మశక్యం కాదని ఆయన ప్రశ్నించారు.
కేసులో అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజీ విషయంలో సిట్ నిర్లక్ష్యం చూపిందని లేఖలో ఆరోపించారు. డీజీపీ ఆధీనంలోని టెక్నికల్ వింగ్‌లో ఉన్న ఫుటేజీని వెంటనే సీజ్ చేయకపోవడం, ఓవర్‌రైట్ లేదంటే డిలీట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం తీవ్రమైన లోపమని ఆయన పేర్కొన్నారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ ధ్వంసం కావడంపై కూడా స్పష్టత అవసరమని అన్నారు.
అంతేకాకుండా పోలీస్ అధికారుల ఫోన్లు, మెసేజ్‌లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌ను పరిశీలిస్తే పెద్ద కుట్ర వెలుగులోకి వచ్చేదని.. కానీ సిట్ ఆ దిశగా వెళ్లలేదని అంబటి ఆరోపించారు. భారత న్యాయసంహిత(BNS) సెక్షన్లు 61, 3(5) కింద క్రిమినల్ కాన్స్పిరసీ, కామన్ ఇంటెన్షన్ అంశాలు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
విజయవాడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, మ్యాట్రిక్స్ సర్వైలెన్స్ సిస్టమ్, 90 రోజుల క్లౌడ్ బ్యాకప్ వంటి ఆధునిక నిఘా వ్యవస్థల ఫుటేజీని సిట్ పరిశీలించకపోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. వాహనాల కదలికలు, మృతదేహం తరలింపు వంటి కీలక అంశాలు ఈ ఫుటేజీల్లో ఉండే అవకాశం ఉన్నా వాటిని స్వాధీనం చేసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.
మే 28న బాధిత తల్లి ఇచ్చిన క్రైమ్ పిటిషన్‌పై ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడాన్ని కూడా అంబటి ప్రశ్నిస్తూ విచారణపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లేఖతో సాయికృష్ణ కేసు మరోసారి రాజకీయ, పరిపాలనా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.


