జిల్లాలో ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా ? | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా ?

Jul 18 2026 3:47 AM | Updated on Jul 18 2026 3:47 AM

కళ్యాణదుర్గం: ఆసియా ఖండంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ ప్రాంతం. అందులోనూ అనంతపురం జిల్లా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ప్రజలు కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి జిల్లాలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరానికై నా సాగునీరిచ్చారా అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల సమన్వయకర్త, రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ శైలజనాథ్‌ సూటిగా ప్రశ్నించారు. కళ్యాణదుర్గంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ సమన్వయకర్త, మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు డాక్టర్‌ తలారి రంగయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెపుకుంటున్న వారు ఎక్కడ ప్రాజెక్టులు పూర్తి చేశారు..ఎక్కడ కాలువలు పూర్తి చేశారో చెప్పాలని నిలదీశారు. హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని పెంచాలన్న ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 6,300 క్యూసెక్కులకు పెంచుతూ జీఓ, డీపీఆర్‌ ఇవ్వడం, టెండరు పిలవడం అగ్రిమెంట్లు కూడా జరిగాయన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని 3,800 క్యూసెక్కులకు కుదిస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చి జిల్లా ప్రజలకు ద్రోహం చేశారన్నారు. వైఎస్‌ జగన్‌ గతంలోనే ప్రారంభించిన కుప్పం ప్రాజెక్టును మరోసారి ప్రారంభించి కళ్యాణి డ్యాం వరకు హంద్రీనీవా నీటిని తీసుకెళ్తామని కూటమి నేతలు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 3800 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కాలువకు కేవలం 2700 క్యూసెక్కుల నీటిని తీసుకురావడంలోనూ అధికారులు, పాలకులు విఫలమయ్యారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో హంద్రీనీవా, హెచ్‌ ఎల్‌సీ పనుల ఎస్టిమేషన్‌ రేట్ల కంటే రెండుమూడింతలు పెంచుకుని రూ.కోట్లను కొట్టేశారన్నారు. ఈనెల 19న కూడేరు మండలం చోళసముద్రం వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించడంతో పాటు రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, గ్రేటర్‌ రాయలసీమ ప్రాంత సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన బాధ్యత ఉంటే టీడీపీ, కూటమి నేతలు కూడా రావచ్చని సూచించారు.

ప్రజల కోసమే వైఎస్సార్‌సీపీ ఉద్యమాలు

ఈ ప్రాంత అభివృద్ధికి తామెప్పుడు అడ్డంకి కాదని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజా పోరాటాలను చేస్తుంటే ఓర్వలేక టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని గుర్తు చేశారు. గతంలో ఆర్డీటీ కోసం పాదయాత్ర చేస్తే అన్ని చోట్ల అడ్డుకున్నారన్నారు. విజయోత్సవ ర్యాలీ చేస్తే వంద మందిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. తాము ప్రజల ప్రయోజనం కోసమే పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో బీటీపీ కాలువ తవ్వుతానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నీళ్ల అంశం చిన్న విషయం కాదన్నారు. కొన్ని సందర్భాలలో రాష్ట్రాలతో పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ఈ ప్రాంత ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ ఉద్యమాలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ములకనూరు తిమ్మరాయుడు, దొడగట్ట నారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోనాపురం గంగాధర, మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడు సుధీర్‌, వివిధ మండలాల కన్వీనర్లు గోళ్ల సూరి, ఎంఎస్‌ రాయుడు, వెంకటప్ప, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ తలారి రాజ్‌కుమార్‌, సీనియర్‌ నాయకులు తిరుమల వెంకటేశులు, వన్నూర్‌రెడ్డి, సోమనాథ్‌రెడ్డి, శివ శంకర్‌ నాయక్‌, భీమేష్‌, ఆంజినేయులు, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.

హంద్రీనీవా సామర్థ్యాన్ని 3,800 క్యూసెక్కులకు కుదించింది ఎవరు?

19న చోళ సముద్రంలో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, గ్రేటర్‌ రాయలసీమ సమస్యలపై సమావేశం

అధిక సంఖ్యలో తరలిరావాలని మాజీ మంత్రి శైలజానాథ్‌,

మాజీ ఎంపీ రంగయ్య పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement