కూడేరు: కలెక్టర్ సారూ.. కొన్నేళ్లుగా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. మీరు చొరవ చూపి భూసమస్యలకు పరిష్కారం చూపండని పలువురు రైతులు వేడుకున్నారు. శుక్రవారం కూడేరు మండలం ఉదిరిపికొండలో ‘ఒక గ్రామం–ఒక నెల–నాలుగు సందర్శనలు’ కార్యక్రమాన్ని తహసీల్దార్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. భూసమస్యలపై అనేక మార్లు అర్జీలిచ్చినా పరిష్కారం కాలేదని పలవురు రైతులు కలెక్టర్‌తో వాపోయారు. భూ, ఇతర సమస్యలపై ప్రజల నుంచి 176 అర్జీలు వచ్చాయి. భూసమస్యలు పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపుతారన్నారు.ఉదిరిపికొండలో తాగునీటి సమస్య వేధిస్తోందని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన కలెక్టర్... ఎంపీడీఓ కుళ్లాయి స్వామి, ఆర్‌డబ్ల్యూఎస్‌జేఈ నాగదివ్యను పిలిచి వెంటనే అదనంగా బోరు వేసి నీటి సమస్యను తీర్చాలని ఆదేశించారు. మండల పరిధిలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు , మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.


