నామినేట్‌.. లేట్‌! | - | Sakshi
Sakshi News home page

నామినేట్‌.. లేట్‌!

Jul 20 2026 1:32 AM | Updated on Jul 20 2026 1:32 AM

– 8లోu

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల భర్తీపై నెలకొన్న ఉత్కంఠకు మరికొంత కాలం తెరపడే అవకాశం కనిపించట్లేదు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో నామినేటెడ్‌ పోస్టుల నియామకాల ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ తర్వాత చేపట్టే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పదవీకాలం ముగిసిన నేతలు, కొత్తగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారిలో అయోమయం నెలకొంది.

రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ..

ఇటీవలే ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు, ఇతర నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న నేతల పదవీకాలం పూర్తయ్యింది. మరోసారి కొనసాగిస్తారా? లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? అనే చర్చ కొనసాగుతుండగానే నియామకాలు వాయిదా పడతాయనే సంకేతాలు రావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

సభ్యత్వ నమోదుపైనే దృష్టి

ప్రస్తుతం పార్టీకి అత్యంత ప్రాధాన్యమైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపైనే సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. ఈకార్యక్రమం పూర్తయ్యే వరకు ఎలాంటి నామినేటెడ్‌ పోస్టుల నియామకాలపై నిర్ణయం తీసుకోకూడదని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగస్టు 3 తర్వాతే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

అధిష్టానం అప్రమత్తం

నామినేటెడ్‌ పదవుల కోసం కొద్ది రోజులుగా ఆశావహులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు వెళ్లి మంత్రులు, ముఖ్యనేతలను కలుస్తున్న నేపథ్యంలో.. పార్టీ అధిష్టానం కూడా అప్రమత్తమైనట్లు సమాచారం. సభ్యత్వ నమోదుపైనే దృష్టి పెట్టాలని, లాబీయింగ్‌ కోసం హైదరాబాద్‌కు రావొద్దని ముఖ్యనేతలు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. గాంధీభవన్‌లో కూడా ప్రస్తుతం నామినేటెడ్‌ పోస్టుల అంశంపై చర్చలకు పెద్దగా అవకాశం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో

ముగిసిన పలువురి పదవీకాలం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా ఉండగా, జంగా రాఘవరెడ్డి, ఇనగాల వెంకట్రాంరెడ్డి, బెల్లయ్యనాయక్‌, అయిత ప్రకాశ్‌రెడ్డి, పోదెం వీరయ్య, ఎండీ రియాజ్‌తోపాటు కీలక నామినేటెడ్‌ బాధ్యతల్లో ఉన్న నాయకుల పదవీకాలం ఇటీవల ముగిసింది. వీరిలో ఎవరిని కొనసాగిస్తారు? ఎవరికి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.

ఆగస్టు 3 తర్వాతే నామినేటెడ్‌ పోస్టులకు మోక్షం

’సర్‌’పై దృష్టి పెట్టాలన్న సీఎం,టీపీసీసీ చీఫ్‌

హైదరాబాద్‌కు రావొద్దని

నేతలకు సూచన

గాంధీభవన్‌లో లాబీయింగ్‌కు ఇక బ్రేక్‌

ఉమ్మడి వరంగల్‌లో పలువురి

పదవీకాలం ముగింపు

ఆశావహుల్లో అంతా అయోమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement