● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
దుగ్గొండి: స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వం అందిస్తున్న జీరో వడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ.80లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళలు కుటీర పరిశ్రమలు స్థాపించి ఆర్థికంగా ఎదిగి మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తహసీల్దార్ సమ్మక్క, ఎంపీడీఓ అరుందతి, నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తోకల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్, సొసైటీ చైర్మన్‌లు చెన్నూరి కిరణ్‌రెడ్డి, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.


