హన్మకొండ కల్చరల్: ధూపదీప నైవేద్య అర్చకులకు పథకం నుంచి విముక్తి కలిగించి దేవాదాయశాఖ అర్చకులుగా ఉద్యోగ భద్రత కలిగేలా, అర్చకుల సంక్షేమమే పరమావధిగా నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్ భవన్‌లో తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం ఆవిర్భావం జరిగింది. ఈకార్యక్రమానికి గంగు ఉపేంద్రశర్మ ముఖ్య అతిథిగా హాజరై సంఘం లోగోను ఆవిష్కరించి మాట్లాడారు. దోపిడీకి గురవకుండా డీడీఎన్ అర్చకులను కాపాడాలని, దానికి అనుగుణంగా అర్చకులంతా ఈ సంఘానికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. సంఘం వ్యవస్థాపకులు వెగ్గళం సంతోష్ శాస్త్రి మాట్లాడుతూ.. అర్చకుల సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారానికి సంఘం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అర్చక సంఘాల నాయకులు ఓరుగంటి మాధవాచార్యులు, తాపాల వెంకటాద్రి, అన్నవజ్జుల ప్రసాద్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ
డీడీఎన్ అర్చక సంక్షేమ సంఘం
లోగో ఆవిష్కరణ


