నిర్మాణం పూర్తి చేసుకున్న వరంగల్ ఐడీఓసీ భవనం
న్యూశాయంపేట: ప్రతిష్టాత్మక సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ (ఐడీఓసీ) భవన ప్రారంభోత్సవం నిరంతరం వాయిదా పడుతూ వస్తోంది. పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నా కొత్త కలెక్టరేట్ ప్రారంభం ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది. కలెక్టరేట్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రస్తుత కలెక్టరేట్, వివిధ ప్రభుత్వ శాఖలు ఇరుకై న భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నిరంతర విద్యుత్ అందించేందుకు ఐడీఓసీ ప్రాంగణంలో ప్రతిపాదించిన ప్రత్యేక సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు నేడు (బుధవారం) డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. సబ్‌స్టేషన్ లేకపోవడంతోనే కలెక్టరేట్ ప్రారంభోత్సవం అటకెక్కిందని తెలుస్తోంది.
ప్రత్యేక విద్యుత్ సబ్‌స్టేషన్ కీలకం..
వరంగల్ ఆజంజాహి మిల్లు మైదానంలో రూ.80 కోట్ల నిధులతో ఐడీఓసీ భవనం నిర్మించారు. అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే చోటకు చేర్చి ప్రజలకు పాలనను సులభతరం చేయాలన్నది ప్రధాన లక్ష్యం. అయితే ఈభారీ సముదాయానికి అవసరమైన నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా సబ్‌స్టేషన్ నిర్మాణం కీలకం కానుంది. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని వందలాది ఏసీలు, కంప్యూటర్లు, లిఫ్టులు సెంట్రల్ లైటింగ్ సిస్టం పనిచేయడానికి సాధారణ విద్యుత్ కనెక్షన్ సరిపోదు. దీనికోసం ప్రత్యేక లైన్లు హై–కెపాసిటీ ట్రాన్స్‌ఫార్మర్లతో కూడిన సబ్‌స్టేషన్ తప్పనిసరికానుంది. శంకుస్థాపన జరిగి యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేస్తేనే వరంగల్ ఐడీఓసీ భవన ప్రారంభానికి ముహూర్తం ఖరారవుతుంది.
విలీన రాజకీయం ఐడీఓసీకి
అసలు శాపమా?
పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో విడిపోయిన వరంగల్, హనుమకొండ జిల్లాల విలీనం ఇప్పుడు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి అడ్డుగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు రెండు జిల్లాలను మళ్లీ కలిపేస్తారా అనే సందేహాలు, ఊహాగానాలు ఐడీఓసీ భవన ప్రారంభోత్సవాన్ని మరింత వెనక్కి నెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఒత్తిడితో రెండు జిల్లాలను మళ్లీ కలిపి ఒకటిగా మార్చే ప్రతిపాదనలు తెరపైకి రావడం కూడా ఆలస్యం కావడానికి కారణమవుతున్నాయి. ఒకవేళ జిల్లాలు కలిపితే ఏ జిల్లా కేంద్రం నుంచి పాలన కొనసాగించాలి అనే దానిపై స్పష్టత లేదు. దీంతో ఉన్నతాధికారులు చివరి నిమిషం వరకు పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఓ స్పష్టమైన నిర్ణయానికి వస్తేనే వరంగల్ కలెక్టరేట్‌కు మోక్షం లభిస్తుంది. ఏ నిర్ణయం అయినా త్వరగా తీసుకొని ఐడీఓసీని అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
వరంగల్ జిల్లా పాలనంతా హనుమకొండ నుంచే..
తాత్కాలిక భవనాల్లో కార్యాలయాలు.. తప్పని ఇబ్బందులు
నేడు ఐడీఓసీలో సబ్‌స్టేషన్‌కు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
పేరుకే వరంగల్ జిల్లా..
ప్రస్తుతం వరంగల్ జిల్లాకు సంబంధించిన అధికారిక పాలన హనుమకొండలోని తాత్కాలిక కలెక్టరేట్ నుంచే నడుస్తోంది. వరంగల్ తూర్పు, నర్సంపేట వర్ధన్నపేట నియోజకవర్గాల ప్రజలు వివిధ పనుల కోసం హనుమకొండలోని కలెక్టరేట్‌తోపాటు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. ఐడీఓసీ పూర్తయితే ఒకే భవనంలో అన్ని కార్యాలయాలు ఏర్పాటవుతాయని ఆశించిన జనం నిరాశకు గురవుతున్నారు.


