వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌ ఫౌండేషన్‌ అవార్డు అందజేత | - | Sakshi
Sakshi News home page

వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌ ఫౌండేషన్‌ అవార్డు అందజేత

Jul 20 2026 1:32 AM | Updated on Jul 20 2026 1:32 AM

రాయపర్తి: మండలంలోని కాట్రపల్లికి చెందిన రాపాక ప్రశాంత్‌ ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లాకేంద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలోని వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎండీ పాషా, ప్రతినిధులు చేతుల మీదుగా అందుకున్నారు. గ్రామంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రశాంత్‌కు అవార్డు అందించినట్లు ఫౌండేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ మాట్లాడుతూ గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు.

జాతీయస్థాయి

క్రికెట్‌ పోటీలకు సాయితేజ

దుగ్గొండి: మండలంలోని మైసంపల్లి గ్రామానికి చెందిన మాసంపల్లి సాయితేజ జాతీయస్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన పద్మ, మోహన్‌ దంపతుల కుమారుడు సాయితేజ 1 నుంచి 4వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాల, ఐదు నుంచి 10వ తరగతి వరకు కమలాపూర్‌ ఎంజేపీలో చదవి హైదరాబాద్‌లోని సింగారంలోని ఎంజేపీ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. సాయితేజ ఐదు సార్లు జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో రాష్ట్రం తరఫున అండర్‌ 19 విభాగంలో పాల్గొని 20–20 మ్యాచ్‌లో బెస్ట్‌ ఫీల్డర్‌గా అవార్డు తీసుకున్నాడు. అక్టోబర్‌లో గోవాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అయితే క్రికెట్‌ కిట్‌ లేకపోవడంతో ఇబ్బంది అవుతుందని, దాతలు సహకరించి క్రికెట్‌ కిట్‌ అందిస్తే మరింత సాధన చేసి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకువస్తానని సాయితేజ తెలిపారు. క్రికెట్‌లో రాణించడానికి సహకరించిన గురుకుల పాఠశాలల కార్యదర్శి సైదులు, ఎంజేపీ ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఘనంగా సౌరవృత్త తారావళి పుస్తకావిష్కరణ

హన్మకొండ కల్చరల్‌: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్‌ ఆధ్వర్యంలో అజో విభో కంధాళం ఫౌండేషన్‌ అధ్యక్షుడు అప్పాజోస్యుల సత్యనారాయణ రచించిన సౌర వృత్త తారావళి, వ్యాఖ్య పుస్తకాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పీఆర్‌ రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో సహృదయ సంస్థ అధ్యక్షులు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీ వేత్త, కవి విహారి, విశిష్ట అతిథులుగా తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి అనుమాండ్ల భూమయ్య, రచయిత, వ్యాఖ్యాత ఆచార్య తాడేపల్లి పతంజలి, సాహితీవేత్త డాక్టర్‌ దహగం సాంబమూర్తి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర సాహితీ అవార్డు గ్రహిత డాక్టర్‌ అంపశయ్య నవీన్‌, కవి రామచంద్రమౌళి, వీఆర్‌.విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వనం లక్ష్మీకాంతారావు, మల్యాల మనోహరరావు, కళా రాజేశ్వర్‌, డాక్టర్‌ టి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు హెచ్‌ఎంలకు ఓరియంటేషన్‌

విద్యారణ్యపురి: హైదరాబాద్‌లోని కొమురంభీమ్‌ ఆదివాసీ భవన్‌లో పీఎం శ్రీ స్కూల్స్‌ హెచ్‌ఎంలు, జిల్లాస్థాయి అధికారులు, ఎఫ్‌ఏఓ, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌, జీసీడీఓ, సిస్టం అనలిస్టులకు సోమవారం ఓరియంటేషన్‌ కార్యక్రమం ఉంటుందని హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్వీ గిరిరాజ్‌గౌడ్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈఓరియంటేషన్‌కు జిల్లాలోని 19 పీఎం శ్రీస్కూల్స్‌ హెచ్‌ఎంలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, జాతీయ విద్యావిధానం, పీఎంశ్రీ పాఠశాలల అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, సమర్థంగా డిజిటల్‌ వ్యవస్థ వినియోగం, పాఠశాలల పనితీరుపై శిక్షణలో అవగాహన కల్పిస్తారని డీఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement