ఎక్కడ పడితే అక్కడే దర్శనమిస్తున్న సరిహద్దు రాళ్లు
బొండపల్లి: గత ప్రభుత్వ హయాంలో సర్వే నిర్వహించి రైతుల భూముల సరిహద్దుల కోసం కేటాయించిన సరిహద్దు రాళ్లను రెవెన్యూ అధికారులు తమ ఇష్టారాజ్యం ఎక్కడిపడితే అక్కడ పడేయడంతో ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారులే ఇలా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా పట్టించుకోరా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో సర్వే అనంతరం రైతుల భూముల్లో హద్దుల కోసం ఏర్పాటు చేయాల్సిన సరిహద్దు రాళ్లు పాతకుండా ఎక్కడిపడితే అక్కడ పడేసి గత ప్రభుత్వంపై నిందలు వేసేలా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పడో జరిగిన భూ సర్వే స్థానంలో గత ప్రభుత్వ హయాంలో సమగ్ర భూ సర్వేను విడతల వారీగా గ్రామాల్లో చేపట్టగా సగానికి పైగా గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి సరిహద్దు రాళ్ల భారం రైతులపై పడకుండా నేరుగా ప్రభుత్వమే నిధులు కేటాయించి ఏర్పాటు చేసింది. అయితే కొంతమంది రెవెన్యూ అధికారులు ఉదాసీనత కారణంగా గ్రామాలకు కేటాయించిన రాళ్లు ఎక్కడిపడితే అక్కడ వదిలేసి రైతుల పొలాల్లో పాత కుండా చేతులు దులుపుకున్నారు. మండలంలోని తమటాడ, బోడసింగి పేట గ్రామాల్లో సర్వే రాళ్లు చెత్త కుప్పల్లోను, రచ్చ బండల వద్ద ఎక్కేందుకు అవసరమైన మెట్లుగా ఉపయోగించడం పట్ల రెవెన్యూ అధికారుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


