వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు ఈ నెల 24న సాగునీటిని విడుదల చేస్తామని డీఈ పి.అర్జున్ మంగళవారం తెలిపారు. ఆయకట్టు పరిధిలోని 24,877 ఎకరాలకు సాగునీటిని అందిస్తామని వెల్లడించారు. స్టేజ్–1లో వంగరలో 996, రేగిడిలో 6,777, సంతకవిటిలో 10,976, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో 6,029, పొందూరు మండలంలో 99 ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
మహాలక్ష్మిగా సుభద్రాదేవి
విజయనగరం టౌన్: జగన్నాథుడి రథయాత్రలో భాగంగా ఆరోరోజు నిర్వహించిన హీరాపంచమి వేడుకలు హుకుంపేటలోని గుండిచా ఆలయంలో వైభవంగా నిర్వహించారు. సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామి శ్రీరామకృష్ణ అవతారంలో మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. సుభద్రాదేవిని మహాలక్ష్మి రూపంగా భావిస్తూ 160 పట్టుచీరలతో అత్యంత మనోహరంగా అలంకరించారు. ఆలయ ధర్మకర్తలు వెంకటేశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మహా అన్నప్రసాద సంతర్పణ చేశారు.
ఇజ్రాయిల్‌లో ఉద్యోగావకాశాలు
● ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపడుతోందని జిల్లా ఎస్సీ సేవా సహకార సంస్థ కార్యనిర్వహక సంచాలకు (ఈడీ) వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయిల్‌లో ఉన్న ‘హోమ్ బేస్డ్ కేర్ గివర్’ ఉద్యోగాలకు జీడీఏ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్హతతో 25 నుంచి 45 సంవత్సరాల వయోపరిమితి ఉన్న అభ్యర్థులు అర్హులని. ఎంపికై న అభ్యర్థులకు ఇంటర్మీడియట్ స్థాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఇజ్రాయిల్ పంపనున్నట్లు తెలిపారు. అక్కడ నెలకు సుమారు రూ.1,99,770 వరకు సంపాదించే అవకాశం లభిస్తుందన్నారు. ఇతర నైపుణ్య శిక్షణ కోర్సుల్లో కిసాన్ డ్రోన్ ఆపరేటర్/డ్రోన్ సర్వీస్ టెక్నిషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, సోలార్ పీవీ.ఇన్‌స్టాలర్, బూటీథెరపిస్ట్, ప్లంబింగ్ జనరల్ వంటివి ఉన్నాయని వాటికి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండాలని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమాలను డీఆర్‌డీఏ, పరిశ్రమల శాఖ, వ్యవసాయ, మత్స్య, పశుసంవర్థక, ఉద్యానవన శాఖ సమన్వయంతో అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆపన్న హస్తం
వేపాడ: మండలంలోని బల్లంకి గ్రామానికి చెందిన కోట సాయిలక్ష్మి (23) పేస్‌మేకర్ సమస్య శస్త్రచికిత్సకు అమెరికాలో స్థిరపడిన 1987 ఇంజినీరింగ్ ఉద్యోగులు రూ.ఐదు లక్షలు ఆమె ఖాతాకు జమచేసి మానవత్వం చాటుకున్నారు. సాయిలక్ష్మికి చిన్నవయస్సులోనే గుండెకు రంధ్రం పడడంతో 2005లో శస్త్రచికిత్స చేశారు. నాటి నుంచి నేటికి పలుమార్లు పేస్‌మేకర్స్ అమర్చడంతో జీవనం సాగిస్తోంది. ఇటీవల పేస్‌మేకర్‌లో సాంకేతిక లోపంతో పనిచేయకపోవడంతో ప్రాణాపాయం తలెత్తింది. నాణ్యమైన పేస్‌మేకర్ అమర్చేందుకు లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో సాయిలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు వివిధ ప్రచారమాధ్యమాల్లో సాయం అర్ధించారు. దీనికి స్పందించి సాయం చేసిన ఎన్‌ఆర్‌ఐలకు బాధితురాలుతోపాటు తల్లి దండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.


