రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. వాటిని నిరోధించడంలో ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. ఇక పోలీస్ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ తొత్తుగా మారిపోవడం దురదృష్టకరం. ఇటీవల గుంటూరు, బద్వేలు తదితర ప్రాంతాల్లో మహిళలను వివస్త్రలను చేసి అవమానించిన అమానవీయ ఘటనలు రాష్ట్రంలో దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. నాగరిక సమాజానికే మాయని మచ్చగా నిలుస్తాయి. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థలు, మహిళా పోలీస్ స్టేషన్లు, హెల్ప్‌లైన్లు, పెట్రోలింగ్ బృందాలు సమర్థవంతంగా పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మహిళలకు భరోసా కల్పించాలి.
– బొత్స అనూష, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు


