● కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
పూసపాటిరేగ: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించేందుకు వచ్చేనెల 1వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారని, ఆయన పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధాన మంత్రి రూట్‌మ్యాప్, సభా స్థల వివరాలు, పార్కింగ్ ప్రదేశాలకు చెందిన రూట్‌మ్యాప్, పబ్లిక్ హోల్డింగ్ పాయింట్లను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులకు కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి మంగళవారం వివరించి తగు సూచనలు చేశారు. విమానాశ్రయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో తగు సూచనలు చేశారు. వీఐపీలు పార్కింగ్ స్థలం నుంచి వేదికకు వచ్చే మార్గంలో రెండంచెల బారికేడ్లు అమర్చాలని జీఎంఆర్ ప్రతినిధులకు సూచించారు. ప్రధానికి స్వాగత కార్యక్రమంలో పాల్గొనే కళాకారులు, విద్యార్థులకు తాగునీరు, అల్పాహారం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సభకు హాజరయ్యే వారికి సెక్టార్ల వారీ రంగులతో కూడిన గుర్తింపు కార్డులు తయారు చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశం నుంచి సభా స్థలి వరకు ప్రజలు హాజరయ్యేందుకు నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేయాలని అడిషనల్ ఎస్పీ సౌమ్యలతను ఆదేశించారు. సమావేశంలో జీఎంఆర్ ప్రతినిధులు, జేసీ సేతుమాధవన్, జీసీసీ ఎం.డి. శోభిత, ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్ష
ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఈ నెల 28వ తేదీకి పూర్తిచేయాలని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రధాని పర్యటన కార్యక్రమం నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు, పీఎం కార్యక్రమం ప్రత్యేకాధికారి వీరపాండ్యన్ జిల్లా అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి ఏర్పాట్లపై వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడారు. భద్రత, ప్రజలకు సదుపాయాల కల్పనపై సూచనలిచ్చారు.


