ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎం.డిపై
● వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు
విజయనగరం: ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ మీడియా చానల్ ఎం.డి వేమూరి రాధాకృష్ణపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడంలో జాప్యం వహించడం సరికాదని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణులు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, మహిళలను కించపరిచేలా తప్పుడు కథనాలు ప్రచురించిన రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణపై బేషరతుగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండేళ్ల పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. గతంలో టీటీడీ ఛైర్మన్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో ఎటువంటి చర్యలు లేవన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన రెండేళ్లలో చెప్పేందుకు చేసిందేమి లేక ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రె
డ్డిపై అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలపై ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ శ్రేణులుపై అక్రమ కేసులు బనాయించి , పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతున్నారని, రాధాకృష్ణ లాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం ఎందుకని నిలదీశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్ కౌశిక్, ఎస్సీ విభాగం నాయకుడు బొంగ భానుమూర్తి, మాజీ కార్పొరేటర్‌లు అల్లు చాణక్య, బండారు ఆనంద్, బోడసింగి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


