● విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
విజయనగరం క్రైమ్: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు దాదాపు 7,500 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సోమవారం తెలిపారు. భోగాపురం మండలంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చే నెల 1 న ప్రధాన మంత్రి మోడీ వస్తున్న సందర్భంగా క్షేత్ర స్థాయిలో సభావేదిక, పార్కింగ్, ప్రజా రవాణా, కాన్వాయ్ వెళ్లే మార్గాలను, భద్రత, బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ ఏఆర్ దామోదర్‌దతో కలిసి విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పర్యవేక్షించి భద్రతా పరమైన సూచనలు చేశారు. ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, ప్రజా వేదికను డీఐజీ సందర్శించారు. జరుగుతున్న పనులను, ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్ విషయంలో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పటిష్టం చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ దామోదర్ ను ఆదేశించారు. బందోబస్తును సెక్టార్లుగా విభజించి బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి సమ
స్యలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. బందోబస్త్ ఏర్పాట్లపై ఎస్పీ దామోదర్ రూట్ మ్యాప్ ప్రెజెంటేషన్ ద్వారా డీఐజీకి వివరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎస్పీ కె.మహేశ్వర రెడ్డి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, విజయనగరం అదనపు ఎస్పీలు సౌమ్యలత, కిరణ్ కుమార్, డీఎస్పీలు రాఘవులు, నరసింహరావు, వీరకుమార్ సీఐలు దుర్గా ప్రసాద్, శ్రీనివాస్, ఎస్సైలు సన్యాసిరావు, అరుణ్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


