చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలం కొండశంభాం గ్రామానికి చెందిన వివాహిత పిల్లా శ్రీలక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించి గరివిడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చీపురుపల్లి మండలంలోని కరకాం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మికి కొండశంభాం గ్రామానికి చెందిన పిల్లా సాయితో ఈ నెల 2వ తేదీన వివాహం జరిగింది. శ్రీలక్ష్మి గతంలో హైద్రాబాద్‌లో ఉద్యోగం చేసేది. హైదరాబాద్‌లో ఉండేటప్పుడు ఓ వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండేదన్న విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.
ఈ విషయాన్ని తన భర్త తండ్రికి తెలియజేస్తే తట్టుకోలేడని మనస్తాపం చెందిన శ్రీలక్ష్మి ఈ నెల 17న పురుగు మందు తాగేసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆమెను వెంటనే విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం ఆమె మృతిచెందింది. మృతురాలి తండ్రి కడగల బంగారునాయుడు ఫిర్యాదు మేరకు ఎస్సై బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


