యోగాంధ్ర తెచ్చిన తంటా..! | Vizianagaram Yoga Andhra Event Triggers Traffic Disruption And Coordination Row Between Municipal And Police Departments | Sakshi
Sakshi News home page

యోగాంధ్ర తెచ్చిన తంటా..!

Jun 8 2026 11:26 AM | Updated on Jun 8 2026 12:51 PM

విజయనగరం క్రైమ్‌: చంద్రబాబు సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమం ఆదివారం రెండు శాఖల మధ్య  తంటా తెచ్చిపెట్టింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద  ఉదయం ఆరున్నర గంటలకు యోగాంధ్ర  పేరుతో మహిళలతో యోగాసనాలు వేయించారు. ఇందుకోసం ఆ రోడ్డులో ముందుగానే ఎడమవైపు శివాలయం వీధి, కుడిపైపు  కోరాడ వీధిని మున్సిపల్‌ కార్పొరేషన్‌ శాఖ దిగ్బంధం చేయంచింది. వాస్తవానికి అక్కడే యోగా కార్యక్రమం ఉంటుందని పోలీస్‌ శాఖకు ముందుగానే చెప్పాలి. పోలీస్‌ శాఖకు వచ్చే ఆదేశాలతో ట్రాఫిక్‌ విభాగాన్ని అప్రమత్తం చేస్తుంది. 

ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా కార్యక్రమం జరిగిపోతుంది. అనుకున్న ప్రకారం ఉదయం ఆరున్నర గంటలకు మున్సిపల్‌ శాఖ యోగా ఇన్‌ స్ట్రక్టర్స్‌తో పైడితల్లి దేవాలయం వద్దే మహిళలతో యోగాసనాలు వేయించి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది. ఆదే  సమయంలో అటు శివాలయం వీధి నుంచి ఇటు కోరాడ వీధి నుంచి ప్రజలు  రాకుండా బారికేడ్స్‌తో పాటు హర్డిల్స్‌ పెట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ఇటు మున్సిపల్‌ శాఖ, అటు ట్రాఫిక్‌ పోలీసులకు ప్రజలు అక్షింతలు వేశారు. సరిగ్గా  7.45కు   కార్యక్రమం అయిపోయిన వెంటనే అక్కడే ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై సత్యం నాయుడికి ట్రాఫిక్‌ సీఐ సూరినాయుడు ఫోన్‌ చేసి మరీ అక్షింతలు వేశారు.

యోగాంధ్ర కార్యక్రమం  జరుగుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులు పడ్డారని కంట్రోల్‌ రూమ్‌ కు ఫోన్‌ ల ద్వారా ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనికి    ఏఎస్సై నాయుడు బదులిస్తూ మున్సిపల్‌ శాఖ ముందుగా సమాచారం ఇవ్వలేదని, ఎస్సై భాస్కర్, తాను,హెచ్‌సీ హరి ఉదయం ఆరు గంటలకే యోగాంధ్ర కార్యక్రమం జరిగే స్థలానికి వచ్చి ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టామని వివరణ ఇచ్చారు.  ఏదేమైనప్పటికీ నగరంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం   ప్రజలను కాస్త ఇబ్బంది పెట్టింది. పైగా అటు మున్సిపల్‌ శాఖ, ఇటు ట్రాఫిక్‌ విభాగాల మధ్య తంటా తెచ్చిపెట్టింది.

 


 

Advertisement
 
Advertisement
Advertisement