కనగానపల్లిలో టీడీపీ నాయకుల ఘాతుకం
దాడిలో మరో యువకునికి తీవ్ర గాయాలు
కనగానపల్లి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గూండాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లిలో మంగళవారం వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏ అంకె నగేష్ (42)ను టీడీపీ సానుభూతి పరులు రాళ్లతో దాడి చేసి చంపేశారు.
ఇచ్చిన బాకీ అడిగినందుకు..
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంకె లక్ష్మన్న సోదరుడు అంకె నగేష్ కనగానపల్లిలో వైఎస్సార్‌సీపీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)గా పనిచేస్తున్నాడు. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్న నగేష్ అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అంకె మురళికి కొంత నగదు అప్పుగా ఇచ్చాడు. రెండేళ్లుగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో రెండు రోజుల క్రితం నగేష్ వారి ఇంటికి వెళ్లి అడిగాడు. ఈ సందర్భంలోనే మురళీ కుటుంబ సభ్యులు నగేష్ తో గొడవకు దిగారు.
‘‘నీకు డబ్బులు ఇచ్చేది లేదు’’ అని తేల్చి చెప్పారు. దీంతో వారిపై మంగళవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటానికి నగేష్, తన అన్న కుమారుడు అంకె పురుషోత్తంతో కలిసి వెళ్తుండగా మురళి, అతని కుటుంబ సభ్యులు కాపు కాసి రాళ్లు, ఇటుక పెళ్లలతో దాడి చేశారు. నగేష్‌కు ఛాతీ, తలపై గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఘటనలో పురుషోత్తం తలకు కూడా తీవ్ర గాయమైంది. సమీపంలో ఉన్న నగేష్ బంధువులు అక్కడికి చేరుకొని గాయపడ్డ ఇద్దరినీ ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన నగేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య రాధమ్మ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకుని పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
కనగానపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
నగేష్ హత్యతో కనగానపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగేష్ హత్యకు ఆర్థికలావాదేవీలే కారణంగా కనిపిస్తున్నా.. ఇందులో రాజకీయ దురుద్దేశాలూ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. నగేష్ పార్టీ బీఎల్‌ఏగా గ్రామంలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులూ వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో వారు ముందుకు రాకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీ సానుభూతిపరులు నగేష్ హత్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడ్ల దస్తగిరి బాబు, నితీష్, వంశీ, వన్నూరప్ప, మురళి, సురేష్, అక్కులప్ప, నాగమణి, జ్యోతి, అఖిల, లక్షి్మదేవిలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.


