హంద్రీ–నీవా లైనింగ్‌లో లూటీ | - | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవా లైనింగ్‌లో లూటీ

Jul 22 2026 1:23 AM | Updated on Jul 22 2026 1:23 AM

కోతల రాయుడు పయ్యావుల కేశవ్‌ జిల్లాకు చేసిన మేలు ఏమిటో?

వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు,

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ధ్వజం

అనంతపురం: ‘ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటి హంద్రీ–నీవా కాలువకు లైనింగ్‌ పేరుతో వందలాది కోట్లు లూటీ చేశారు. ఈ అంశంపై పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఉలుకెందుకు?’ అని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హంద్రీ–నీవా పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తే కేసులు పెడుతానంటూ బెదిరిస్తావా అంటూ కేశవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేపట్టిన హంద్రీ–నీవా యాత్రకు అనూహ్య స్పందన రావడం చూసి భయంతో వెంటనే ఆయన కాలువ వద్దకు వెళ్లారన్నారు. తాను ఎక్కడా కేశవ్‌ను వ్యక్తిగతంగా విమర్శించకపోయినా టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. నెల్లూరు మీటింగ్‌లో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి వారి అనుకూల సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రూ.కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటూ అవి నీతికి పాల్పడ్డారని వ్యాఖ్యానిస్తే ఆ అంశాన్ని అనుకూలంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ‘సాగునీరు, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలపై చంద్ర బాబుకు మంచి అభిప్రాయం లేదని చాలా సార్లు చెప్పా. నెల్లూరు సమావేశంలో ఏం మాట్లాడానని నాకు తెలుసు, మా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తెలుసు’ అన్నారు. ఆత్మసాక్షి లేనిది కేశవ్‌కే అని ఘాటుగా స్పందించారు. ‘గతంలో నువ్వు కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేశావో చెప్పమంటావా’ అంటూ నిలదీశారు. లక్ష్మీపార్వతి కాళ్లు పట్టుకుని టికెట్‌ తెచ్చుకుని మళ్లీ చంద్రబాబు పంచన చేరిన విలువలు లేని నాయకుడు కేశవ్‌ అంటూ విరుచుకుపడ్డారు. నమ్మే వారు ఉంటే ఉరవకొండలో ఉన్న కొండను, అనంతపురం టవర్‌క్లాక్‌ను కూడా కట్టానంటారని ఎద్దేవా చేశారు. ఆర్థిక శాఖను అవినీతి శాఖగా మార్చేశాడని, కమిషన్లు లేకుండా ఏ పనీ జరగదన్న ముద్ర పడిందన్నారు. బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు.

జగన్‌కు పేరొస్తుందనే..

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముందుచూపుతో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, అలాంటి ప్రాజెక్టుకు టీడీపీ వచ్చిన తర్వాత గ్రహణం పట్టిందన్నారు. జగన్‌కు పేరు వస్తుందనే ఒకే ఒక ఉద్దేశంతో అడ్డుకున్నారన్నారు. ఈ అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా చెప్పారని, దీనిపై టీడీపీ నేతలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అనుమతులు లేకున్నా అప్పర్‌ పెన్నా పనులు చేస్తున్నారన్నారు. తుంగభద్ర కేటాయింపుల కంటే ఎక్కువ వాడుకుంటున్నా కనీసం చంద్రబాబు ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. గోబెల్స్‌ ప్రచారం తప్ప ప్రాజెక్టులు ఆపే ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. హంద్రీ–నీవా అంటే దివంగత నేత వైఎస్సార్‌ గుర్తుకు వస్తారని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. కేశవ్‌ చెప్పేవన్నీ అబద్దాలేనని, గతంలో రెండు సార్లు భూమిపూజ చేయడం తప్ప హంద్రీ–నీవాకు చేసిందేమీ లేదని ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు. కౌకుంట్ల పంచాయతీ విభజనకు ఎందుకు సమ్మతించలేదో దమ్ముంటే బహిరంగ పరచాలని సవాల్‌ విసిరారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఒప్పుకోలేదని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement