యాడికి: చింతలాయపల్లి, కుందనకోట వద్ద 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు భూమి ఇచ్చే రైతులకు ఎకరాకు రూ.19 లక్షల పరిహారం నిర్ణయించినట్లు జేసీ విష్ణుచరణ్ తెలిపారు. మంగళవారం కమలపాడు సమీపంలోని కొండల్లో ఉన్న చింతల వెంకటరాయుడు స్వామి ఆలయ ఆవరణలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ విష్ణుచరణ్ మాట్లాడుతూ చింతలాయపల్లి, కుందనకోట వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు చింతలాయపల్లిలో 223 మంది రైతులకు చెందిన 321.79 ఎకరాలు, కుందనకోటలోని 38 మంది రైతులకు చెందిన 76.5 ఎకరాల పట్టా భూమిని సేకరించినట్లు తెలిపారు. ఎకరా పొలం రూ.19 లక్షలతో ఏపీ జెన్కో కంపెనీ సంస్థ ప్రటించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి, ఏపీ జెన్కో ఇంజినీర్లు ఆదినారాయణ రెడ్డి, డీటీ శ్రీనివాసులు, ఆర్‌ఐ కిష్టప్ప, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.
పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆకతాయి చేష్టలపై కేసు
తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆకతాయిల చేష్టలపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఆరోహనరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాల్లో నలుగురు వ్యక్తులు ముఖాలకు మాస్కులు వేసుకొని రెండు గాజు సీసాలు కేతిరెడ్డి ఇంటి కాంపౌండ్ గోడకు విసిరి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గౌస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు.
20 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 20 మండలాల పరిధిలో 6.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. బెళుగుప్ప 22.2 మి.మీ, బ్రహ్మసముద్రం 21.2, యల్లనూరు 21, గుమ్మఘట్ట 18.8, కళ్యాణదుర్గం 14.6, శింగనమల 11.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు, నార్పల, ఆత్మకూరు, కూడేరు, అనంతపురం, శెట్టూరు, యాడికి, బుక్కరాయసముద్రం, పుట్లూరు, కణేకల్లు, గార్లదిన్నె తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జూలై నెల సాధారణ వర్షపాతం 68.4 మి.మీ కాగా ప్రస్తుతానికి 14.7 మి.మీ నమోదైంది. ఓవరాల్‌గా జూన్ ఒకటి నుంచి ఈ సీజన్‌లో 106.8 మి.మీ గానూ 22 శాతం తక్కువగా 83.1 మి.మీ వర్షం కురసింది.
మరోసారి తెరపైకి ఈ స్టాంప్ కుంభకోణం
కళ్యాణదుర్గం: రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ– స్టాంప్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. కేసు విచారణ నిమిత్తం మంగళవారం కర్నూలు సీఐడీ రీజినల్ ఆఫీస్ నుంచి ఎస్‌ఐ శివశంకర్ నాయక్ కళ్యాణదుర్గం రావడం చర్చనీయాంశమైంది. పట్టణ పోలీసు స్టేషన్లో స్థానిక సీఐ హరినాథ్‌తో కేసు విషయమై చర్చించినట్లు సమాచారం. మీ సేవ సెంటర్‌లో నాన్ జ్యుడీషియల్ ఈ–స్టాంపుల విక్రయానికి సంబంధించి జరిగిన మోసాలపై అప్పట్లో కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్‌లో నమో దైన కేసులపై ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో పాటు నిందితుల బ్యాంకు లావాదేవీల ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాబు మీ సేవ నుంచి ఈ–స్టాంపులు కొనుగోలు చేసిన వారు తమ ఉద్ద ఉన్న స్టాంపులు నిజమైనవో కాదో ఆన్‌లైన్‌లో ధ్రువీకరించుకోవాలని సీఐడీ అధికారులు ప్రజలకు సూచించారు. అనుమానాలుంటే వెంటనే తమను సంప్రదించాలన్నారు. ఈ–స్టాంప్‌లు, సంబంధిత రసీదులు అందజేస్తే కేసు దర్యాప్తునకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు చేయాలంటే సీఐడీ సీఐ జి.ప్రియతమ్ రెడ్డి (9000099309), ఎస్‌ఐ శివశంకర్ నాయక్ (9247598089), పీసీలు ధనుంజయ, షఫి (9030976992)ను సంప్రదించాలన్నారు. ఈ–స్టాంప్ కేసుపై సీఐడీ అధికారులు లోతైన విచారణ చేపట్టేందుకు కళ్యాణదుర్గం రావడంతో నిందితుల్లో ఆందోళన మొదలైందని స్థానికులు చర్చించుకుంటున్నారు.


