నీళ్లడిగితే దాడి చేసి ప్రాణం తీస్తారా? | - | Sakshi
Sakshi News home page

నీళ్లడిగితే దాడి చేసి ప్రాణం తీస్తారా?

Jul 22 2026 1:23 AM | Updated on Jul 22 2026 1:23 AM

వైఎస్సార్‌ సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి

రాయదుర్గంటౌన్‌: నీళ్లడిగిన పాపానికి దాడి చేసి ప్రాణం తీస్తారా? అంటూ వైఎస్సార్‌ సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ధ్వజమెత్తారు. కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ లావణ్య, ఆమె భర్త మారుతిప్రసాద్‌లను తక్షణమే అరెస్ట్‌ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆంజనేయులు మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. 43 ఉడేగోళం గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో తన ఇంటి కొళాయికి సరిగా నీరు రావడం లేదని ఆంజనేయులు ఆవేదన చెందారన్నారు. పింఛన్‌ డబ్బు కట్‌ చేసినా కొళాయికి నీరు రాకపోవడంతో అడిగేందుకు టీడీపీ నాయకుడు మారుతీప్రసాద్‌ ఇంటికి వెళ్లాడన్నారు. ఈ క్రమంలోనే ఇంటి వద్దకు వచ్చి ప్రశ్నిస్తావా అంటూ మారుతీప్రసాద్‌, అతని భార్య లావణ్యలు అధికార మదంతో ఆంజనేయులు పొలం వద్దకు వెళ్లి వృద్ధుడిని కూడా చూడకుండా చెప్పులతో కొట్టి కాళ్లతో తన్ని అమానుషంగా చితకబాదారన్నారు. నలుగురి ముందు జరిగిన ఈ అవమానం తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఆంజనేయులు మృత్యువుతో వారం రోజులు పోరాడి మృతి చెందా డని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయులుది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ అధికార మదంతో చేసిన హత్య అని మండిపడ్డారు. వృద్ధుడిపై దాడికి పాల్పడిన మారుతితోపాటు అతని భార్యపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే, పింఛన్‌ డబ్బు కట్‌ చేసి కొళాయి పన్నుకు కట్టిన గ్రామ కార్యదర్శిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అండదండలతో టీడీపీ నాయకుల ఆగడాలు, అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి, కణేకల్లు మండల కన్వీనర్‌ బ్రహ్మానందారెడ్డి, రాయదుర్గం మండల కన్వీనర్‌ రామాంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు మారెన్న, బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి హళ్లి, నాగరాజు, మక్కబుల్‌భాష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement