హత్యకు గురైన దాసరి సూరి , నిందితుడు అర్ఫాజ్
తన అక్క, అన్నను చంపిన బావను హతమార్చిన బావమరిది
మీర్‌పేట: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతీకార హత్య కలకలం రేపింది. తన అక్క, అన్నను చంపాడని పగ పెంచుకున్న నిందితుడు అదను కోసం చూసి, పథకం ప్రకారం రౌడీషీటర్‌ను హతమార్చాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన దాసరి సురేందర్ అలియాస్ సూరి (41) వృత్తిరీత్యా కారు డ్రైవర్. తండ్రి చనిపోవడంతో తల్లి యాదమ్మ, రెండో భార్య పూజ, కుమార్తెతో కలిసి కొంతకాలంగా ఉప్పల్ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో నివాసముంటున్నాడు. అంతకుముందు సూరి ఫాతిమాను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
భార్యపై అనుమానంతో 2022లో ఆమెను హత్య చేశాడు. దీనిపై ఫాతిమా పెద్ద తమ్ముడు సల్మాన్ పలుమార్లు సూరిని బెదిరించడంతో 2024లో అతన్ని కూడా హతమార్చాడు. అనంతరం జైలునుంచి తిరిగివచ్చి నాలుగేళ్ల క్రితం పూజ అనే మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. నందనవనం గణేశ్‌నగర్‌లో నివాసముండే రెండో భార్య పూజ సోదరుడు గోవింద్ జన్మదిన వేడుకకు సోమవారం రాత్రి సూరి ఉప్పల్ నుంచి భార్యతో కలిసి వచ్చాడు. అదేప్రాంతంలో ఉండే మొదటి భార్య ఫాతిమా తమ్ముడు అర్ఫాజ్ (24) కొంతకాలంగా సూరిపై రగిలిపోతున్నాడు.
తన అక్క, అన్నను చంపిన వాడిని ఎలాగైనా తుదముట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సూరి వచి్చన విషయం తెలుసుకుని పథకం ప్రకారం ఇద్దరు అనుచరులతో కలిసి బర్త్‌డే వేడుకకు హాజరయ్యాడు. అందరితో కలివిడిగా మాట్లాడి, సరదాగా ఉన్నట్లు నటించి అందరికీ కేక్ తినిపించి సందడి చేశాడు. కొద్దిసేపటి తర్వాత వెంట తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేను సూరిపైకి వదిలాడు. దీంతో అప్రమత్తమైన సూరి పారిపోతుండగా, కొంతదూరం వెంబడించి టీకేఆర్ కళాశాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి పట్టుకుని ఛాతి, పొట్ట, తొడ భాగాల్లో కత్తితో అర్ఫాజ్ దాడి చేసి పారిపోయాడు.
రక్తపు మడుగులో ఉన్న సూరిని పూజ పెద్దనాన్న కుమారుడు వినోద్ గమనించి మరో ఇద్దరితో కలిసి చికిత్స నిమిత్తం డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సూరిపై తెలంగాణలోని 18 పోలీస్ స్టేషన్లలో 40 కిపైగా క్రిమినల్ కేసులతో పాటు రౌడీషీట్ కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ శోభన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య చేసిన అనంతరం నిందితుడు అర్ఫాజ్ తన అనుచరులతో కలిసి ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్లు ఇన్‌స్టా లైవ్ చాట్ ద్వారా తెలుస్తోంది.



