‘త్రివేణి’కి పచ్చ తాంబూలం! | TDP brazenness regarding the Rs 348 crore Mangampet Barytes tender | Sakshi
Sakshi News home page

‘త్రివేణి’కి పచ్చ తాంబూలం!

Jul 21 2026 6:10 AM | Updated on Jul 21 2026 6:10 AM

TDP brazenness regarding the Rs 348 crore Mangampet Barytes tender

సింగిల్‌ బిడ్‌ వచ్చినా టెండర్ల ప్రక్రియ కొనసాగించి ఖరారు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న భాగం

రూ.348 కోట్ల మంగంపేట బెరైటీస్‌ టెండర్‌లో బరితెగింపు

అడిగిందే తడవుగా టెండర్‌ నిబంధనలు సవరణ 

ఒక్క బిడ్‌ వచ్చినా కాంట్రాక్టు ఖరారు చేసేలా క్లాజు మార్పు  

మిగతా కంపెనీల విన్నపాలు బుట్టదాఖలు 

ఇంత భారీ టెండర్‌కు ఇచ్చిన గడువు 20 రోజులే 

కూటమి పెద్దలతో లాలూచీ వ్యవహారాలు  

సాక్షి, అమరావతి: మంగంపేటలో బెరైటీస్‌ తవ్వ­కాలు, ఓవర్‌ బర్డెన్‌ తొలగింపు (ఖనిజంపై ఉండే మట్టి, రాయి) కోసం ఏపీఎండీసీ పిలిచిన టెండర్‌ కాంట్రాక్టును గాయత్రి సంస్థకు ముందే రాసి­పెట్టి­నట్లు స్పష్టమవుతోంది. ముందస్తు అవగాహ­నతో కూటమి పెద్దలు లాలూచీ పడి ఆ సంస్థకు టెండర్‌ దక్కేలా నిబంధనలు మార్చడంపై విస్మ­యం వ్యక్త­మ­వుతోంది. తిరుపతి జిల్లా ఓబులవారి­పల్లెలోని మంగంపేట గనిలో ఖనిజం పైన ఉండే మట్టి, రాయి­ని తొలగించి ఖనిజాన్ని తవ్వితీసే పనుల కోసం ఇటీవల ఏపీఎండీసీ రూ.348.37 కోట్లతో టెండర్‌ పిలిచింది. 

త్రివేణి అడిగింది.. వెంటనే పచ్చజెండా
మంగంపేట గనిలో తవ్వకాలు నిర్వహిస్తున్న త్రివే­ణి ఎర్త్‌ మూవర్స్‌ కంపెనీ గతేడాది రెండుగా విడిపో­యింది. కొత్తగా ఏర్పడిన త్రివేణి ఎర్త్‌మూ­వర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రా కంపెనీకి టెండర్‌కు అవసర­మైన అనుభ­వం, ఆర్థిక అర్హతలు లేవు. అవన్నీ పాత కంపెనీ పేరి­­ట ఉండడంతో ఇటీవల ప్రీబిడ్‌ సమావేశంలో తాము ఆ టెండర్‌కి పోటీ పడుతున్నామని, పాత కంపె­నీ అర్హతలను తాము వాడుకునేలా టెండర్‌ నిబం­ధనల్లో మార్పు చేయా­లని ఏపీఎండీసీని కోరిం­ది. అడగడమే ఆల­స్యం.. ఏపీఎండీసీ టెండర్‌ నిబంధనలను సవరించింది.

ఇంకా విడ్డూరం ఏమి­టంటే  త్రివేణి తన లేఖలో పేర్కొన్న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వు నంబర్‌ సహా ఆ కంపెనీ రాసిచ్చిన వాక్యా­లే దాదాపు యథాతథంగా సవరణలో చేర్చా­రు. ఏడాది వయసు ఉన్న కంపెనీ కోసం రూ.348 కోట్ల టెండర్‌ నిబంధనలను మార్చే­శారు. అంతటితో ఆగకుండా టెండర్‌ వేసేటప్పుడు కట్టాల్సిన రూ.1.7 కోట్ల ముందస్తు డిపాజిట్‌ (ఈఎండీ) నిబంధనను సైతం ఆ కంపెనీ కోసం సడలించారు. నగదు బదులు బ్యాంకు హామీ పత్రం ఇచ్చినా చాలంటూ ఆ కంపెనీకి వెసులుబాటు కల్పించారు. మిగిలిన కంపెనీల అభ్యర్థనలను పట్టించుకోలేదు.

ఒక్క బిడ్‌ వచ్చినా ఓకే..
టెండర్‌ డాక్యుమెంట్‌లో ఉన్న మరో క్లాజు త్రివేణి, కూటమి పెద్దల మధ్య జరిగిన లాలూచీని బయట­పెడుతోంది. ఎన్ని బిడ్లు వచ్చినా.. చివరకు ఒకే ఒక్క బిడ్‌ వచ్చినా సరే దాన్ని ఓపెన్‌ చేసి ప్రక్రియ నిర్వహిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ఇంత విలువైన కాంట్రాక్టు టెండర్ల దాఖలుకు కేవలం 20 రోజులు గడువు మాత్రమే ఇచ్చారు. తక్కువ గడువుతో కొత్తవాళ్లకు అవకాశం లేకుండా చేయడం, కావాల్సిన కంపెనీ కోసం నిబంధనలు మార్చడం, చివరకు ఆ ఒక్క కంపెనీ బిడ్‌ వేసినా టెండర్‌ ఖరారు చేసి కాంట్రాక్టు కట్టబెట్టే వరకు అంతా పకడ్బందీగా టెండర్‌లో పొందుపరిచారు.

ధరల పోటీకి మంగళం..
సాధారణంగా ఇలాంటి భారీ టెండర్లలో ఎక్కువ మంది పోటీ పడే అవకాశం ఇస్తారు. ఆన్‌లైన్‌లో పోటీపడి ఎవరు తక్కువ రేటుకు పని చేస్తామంటే వారికి కాంట్రాక్టు ఇచ్చేందుకు రివర్స్‌ ఆక్షన్‌ ఉంటుంది. అయితే ఈ టెండర్‌ పత్రాల్లో ఒక చోట రివర్స్‌ ఆక్షన్‌ ఉంటుందని, మరో చోట ఉండదని పేర్కొని.. చివరికి ఉండదని తేల్చేసి ఎక్కువ మంది రాకుండా, ధర పెరగకుండా ఏపీఎండీసీయే అడ్డుకుంది. టెండర్‌లో పోటీ పడాలంటే భారీ యంత్రాలు, వాహనాలు సొంతంగా ఉండా­లని షరతు పెట్టి.. ప్రీబిడ్‌ సమావేశంలో మా­త్రం అవన్నీ బిడ్డర్‌ సామర్థ్యాన్ని తెలు­సుకో­వడానికేనని, పని చేసేటప్పుడు ఆ యంత్రా­లు గనిలో అవసరం లేదని చెప్పడం విశేషం.

గుట్టుచప్పుడు కాకుండా..
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండర్‌ను పారదర్శకంగా జ్యుడీషియల్‌ ప్రివ్యూకి పంపి పరిశీలించేవారు. 2021లో ఇదే మంగంపేట గని టెండర్‌ జ్యుడీషియల్‌ ప్రివ్యూ, ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే ముందుకు సాగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జ్యుడీషియల్‌ ప్రివ్యూని రద్దు చేసింది. ఫలితంగా ఇప్పుడు రూ.348 కోట్ల టెండర్ల ప్రక్రియ మొత్తం గప్‌చుప్‌గా జరిగిపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement