ఎస్‌ఎఫ్‌ఐ కలెక్టరేట్‌ ధర్నా భగ్నం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎఫ్‌ఐ కలెక్టరేట్‌ ధర్నా భగ్నం

Jul 21 2026 12:29 AM | Updated on Jul 21 2026 12:29 AM

గృహనిర్బంధంలో విద్యార్థి సంఘం నేతలు

ప్రభుత్వ తీరుపై ఎస్‌ఎఫ్‌ఐ మండిపాటు

పార్వతీపురం రూరల్‌: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ సోమవారం తలపెట్టిన కలెక్టరేట్‌ ధర్నాను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఆందోళనకు సిద్ధమైన విద్యార్థి సంఘం నేతలను ఉదయం ఆరు గంటలకే ఇళ్ల వద్ద పోలీసులు అనుమతి లేదనే కారణంతో ముందస్తుగా అరెస్టు చేసి గృహనిర్బంధం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడేనని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు హెచ్‌.సింహాచలం తీవ్రంగా ఖండించారు. నిర్బంధాలతో ఉద్యమాలను అణిచివేయలేరని ఆయన ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ముందస్తుగా గృహనిర్బంధం చేసిన వారిలో సింహాచలంతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్‌, నాయకులు గెమ్మల సురేష్‌ తదితరులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా పలు ప్రధాన డిమాండ్లను వారు ప్రభుత్వం ముందుంచారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రూ. 7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు నష్టం చేకూరుస్తున్న ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలను రూ.3 వేలకు పెంచడంతో పాటు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం కేంద్రాల్లో నూతనంగా పీజీ సెంటర్లను వెంటనే ప్రారంభించాలని కోరారు. మరణించిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, గురుకులాలు, ఆశ్రమ కళాశాలలు, వసతిగృహాల్లో ఖాళీగా ఉన్న ఏఎనన్‌ఎం పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులే, వారి పక్షాన పోరాడే గొంతును నొక్కడం తగదని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement