రసాయన వ్యర్థాల తరలింపుతో ఉద్రిక్తత | Tensions with the movement of chemical waste | Sakshi
Sakshi News home page

రసాయన వ్యర్థాల తరలింపుతో ఉద్రిక్తత

Oct 23 2023 4:45 AM | Updated on Oct 23 2023 4:45 AM

Tensions with the movement of chemical waste - Sakshi

మరికల్‌: నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలో ఇథనాల్‌ కంపెనీ నుంచి వ్యర్థాల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్‌ను స్థానికులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటలవరకు హైడ్రామా నడిచింది. రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో వారు తిరగబడి ఎదురు దాడి చేశారు. 

వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి 8 గంటల సమయంలో జూరాల ఆగ్రో ఇథనాల్‌ కంపెనీ నుంచి ఓ ట్యాంకర్‌ రసాయన వ్యర్థాలను నింపుకొని బయటకు వచ్చింది. ఆ వ్యర్థాలను మరికల్‌ మండలం ఎక్లాస్‌పూర్, జిన్నారం గ్రామాల శివా­రులో పారపోస్తున్నారని స్థానికులు ట్యాంకర్‌ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటల వరకు గ్రామస్తులు ఆత్మకూర్‌ రోడ్డుపై ఆందోళన చేయడంతో మరికల్, మక్తల్, కృష్ణ, నర్వ, ధన్వాడ మా­గనూర్‌ పోలీసులతోపాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు రంగంలో దిగారు.

ఈ నేపథ్యంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు­చేసుకుంటుంది. నారాయణపేట డీఎస్పీ సత్యనా­రాయణ ఆందోళనకారులను అదుపు చేయాలని చెప్పడంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. అదే సమ­యంలో ట్యాంకర్‌ను పోలీసుల బందోబస్తు మధ్య తరలించడంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు రాళ్లు, ఇటుకలు, కర్రలతో పోలీసులపైకి దాడికి దిగారు. దీంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయ­టపడేందుకు పోలీసులు పరుగులు పెట్టగా.. మక్తల్‌ సీఐ రాంలాల్‌ను కొందరు పొల్లాలో వెంబడించి తీవ్రంగా గాయపర్చారు.

గాయపడిన మరికొంత మంది పోలీసులు పక్కనే ఉన్న ఆలయంలోకి వెళ్లి దాక్కు­న్నా­రు. ఆందోళనకారులు ఒక పోలీసు వాహనంతో­పాటు రెండు బైక్‌లకు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. డీఎస్పీ వాహనంతోపాటు మరో మూడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆందోళనకు కారణమైన వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement