ఆటోడ్రైవర్‌ నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా | RTC First Women Bus Driver Saritha Naik | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్‌ నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా

Jun 15 2025 12:54 PM | Updated on Jun 15 2025 12:54 PM

 RTC First Women Bus Driver Saritha Naik

ఆర్టీసీ డ్రైవర్‌గా సరితనాయక్‌

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌  కార్పొరేషన్‌ నుంచి తెలంగాణ ఆర్టీసీలో చేరిక

సంస్థాన్‌ నారాయణపురం: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా చేరి.. తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా రికార్డు సొంతం చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన సరితనాయక్‌. మారుమూల గిరిజన తండాలో పుట్టి పెరిగిన సరిత ఇప్పటికే ఢిల్లీలో ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో బస్సు చక్రం తిప్పి దేశంలోనే బస్సును నడిపిన మొదటి మహిళగా పేరు తెచ్చుకుంది. 

తాజాగా ఆమె తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్‌గా విధుల్లో చేరారు. అమ్మా నాన్నలు రాంకోటి, రుక్కలు. సరిత కుటుంబంలో నలుగురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. అక్క దగ్గర ఉంటూ దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల చదివి, అక్కడ నుంచి 10వ తరగతి వరకు ఓపెన్‌ స్కూల్‌లో చదివింది. సరిత కొన్ని రోజులు దేవరకొండలో.. తర్వాత ఐదు సంవత్సరాలు సంస్థాన్‌ నారాయణపురం నుంచి సీత్యాతండా వరకు ఆటో నడిపింది. ఆటో నడుపుతున్న సందర్భంగా ఎదురైన ఇబ్బందులును ఎదుర్కోవడానికి పురుషుల మాదిరిగా వేషధారణ మార్చింది హైదారాబాద్‌లోని బంధువులు ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్‌ నేర్చుకుంది. 

తర్వాత కాలంలో హెవీ వెహికిల్స్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా తీసుకుంది. తెలంగాణలో ఉద్యోగం చేయాలని సరిత గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు విన్నవించింది. హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి , మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. మంత్రి వెంకట్‌రెడ్డి ఆమె హామీ ఇచ్చారు. తాజాగా ఆమె ఎంజీబీఎస్‌ డిపోల్‌ పోస్టింగ్‌ పొందారు. శనివారం ఆమె ఎంజీబీఎస్‌ నుంచి మిర్యాలగూడ వరకు నాన్‌స్టాప్‌ బస్సు నడిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement