భానుపురి (సూర్యాపేట) : సర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిసింది. సోమవారం ముసాయిదా ఓటరు జాబితా వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లతో పాటు మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో జాబితాలను ప్రదర్శించనున్నారు. మృతి చెందిన వారితో పాటు శాశ్వతంగా వలస వెళ్లిన వారు, రెండు చోట్ల ఓట్లు ఉన్న ఓటర్లను జాబితాల నుంచి తొలగించనున్నారు. అందుకోసం బీఎల్‌ఓలు నెల రోజులపాటు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లకు అందించి, పూర్తి చేసిన ఫారాలను తీసుకొని ఆన్‌లైన్ చేపట్టారు. ప్రస్తుతం వెలువడే ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అన్న అయోమయం ఓటర్లలో నెలకొంది.
96 వేలకు పైగా ఓట్లు గల్లంతు..
స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్‌లో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఆ తర్వాత తేదీ పొడిగింపుతో ఈ నెల 10వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగింది. అంతకుముందు జిల్లాలో ఉన్న పది లక్షల ఎనిమిది వేల మంది ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టారు. ఇందులో ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఓట్లు బీఎల్‌ఓలు చేపట్టిన మ్యాపింగ్‌కు మ్యాచ్ అయ్యాయి. లక్షా 84 వేల ఓట్లు మ్యాపింగ్ కాలేదు. అనంతరం ఒక్కో ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాల చొప్పున 20 లక్షల ఫారాలను బీఎల్వోలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. వీటిలో 9,11,945 ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ పూర్తయింది. మరో 96,307 ఓట్లు డిజిటలైజేషన్ కాక పోవడంతో తొలగింపు జాబితాలో చేరారు. దాదాపు ఈ ఓట్లను ఎన్నికల అధికారులు సోమవారం ప్రకటించే ముసాయిదా జాబితా నుంచి తొలగించనున్నారు.
అప్పీల్‌కు అవకాశం
డిజిటలైజేషన్ పూర్తయిన ప్రతి ఓటరు పేరు సోమవారం ప్రకటించే ముసాయిదా జాబితాలో ఉండకపోవచ్చని తెలుస్తుంది. డిజిటలైజేషన్ పూర్తయినప్పటికీ పూరించిన ఫారంలో తప్పులు ఉంటే వీటిని సైతం ఎన్నికల అధికారులు తొలగించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఇప్పటికే డిజిటలైజేషన్ కాని 96 వేలతో పాటు మరిన్ని ఓట్లు ముసాయిదా జాబితాలో చోటు దక్కకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జాబితాలో లేని ఓటర్లు నెలరోజుల పాటు అప్పీలు చేసుకునే వీలు ఉంటుంది.
నేడు ముసాయిదా ఓటరు జాబితా
ఎన్యుమరేషన్ తర్వాత
జాబితాపై ఉత్కంఠ
90 వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం
అభ్యంతరాలు, అప్పీల్‌కు
నెలరోజుల పాటు గడువు
పలువురికి నోటీసులు
ముసాయిదా జాబితా ప్రకటించిన అనంతరం ఎన్యుమరేషన్ ఫారంలో తప్పొప్పులు ఉన్న, డిజిటలైజేషన్ కాకుండా ఉన్నవి, వలస వెళ్లిన వారికి అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ నోటీసులకు ఓటర్లు సరైన ఆధారాలతో సమాధానం ఇవ్వడంతో పాటు తగిన పత్రాలు అప్పగిస్తే తిరిగి తుది జాబితాలో ఓటు కల్పించనున్నారు. సోమవారం ప్రకటించే ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోనన్న సందేహం ప్రజల్లో నెలకొంది.


