నేటి నుంచి మండలాల్లో ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మండలాల్లో ప్రజావాణి

Aug 17 2026 1:47 AM | Updated on Aug 17 2026 1:47 AM

హుజూర్‌నగర్‌ , తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ఉద్దేశించిన ప్రజావాణి కార్యక్రమం ఇప్పటి వరకు కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మండల కేంద్రాల్లో కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడానికి, ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు జిల్లా కేంద్రానికి, ఆర్‌డీఓ కార్యాలయాలకు వచ్చేందుకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం మండల పరిషత్‌ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి జిల్లాలోని 23 మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానున్నది. కార్యక్రమానికి ఎంపీడీఓలు నోడల్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా వాణి పోర్టల్‌కు అనుసంధానం చేయనున్నారు.

నోడల్‌ అధికారులుగా ఎంపీడీఓలు

ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఎంపీడీఓలు నోడల్‌ అధికారులుగా వ్యవహరించ నున్నారు. మండలస్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రతి వారం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మండల స్థాయిలో ఆయా శాఖలకు వచ్చే ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్‌కు అనుసంధానం చేయనున్నారు. ఫిర్యాదు దారునికి గ్రీవెన్స్‌ ఐడీతో కూడిన రసీదు అందిస్తారు. వారి సమస్యలను సంభందిత అధికారుల ద్వారా పరిష్కారం చేసి వాటి వివరాలను ఫిర్యాదు దారుడికి వెల్లడిస్తారు.

మండల పరిషత్‌కు కొత్త రూపు

మండల కేంద్రాలల్లోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున వాటికి కొత్త రూపు తీసుకు రానున్నారు. ప్రజావాణిలో ఎంపీడీఓ, తహసీల్దార్‌, పంచాయతీ అధికారి, వ్యవసాయ, ఉద్యానవన, పశు సంర్ధక, మత్స్య, విద్య, వైద్యాధికారితోపాటు ఐసీడీఎస్‌, గృహ నిర్మాణ, మిషన్‌ భగీరథ, సీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొననున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులలో మండలస్థాయిలోని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించనున్నారు. అంతకు మించిన సమస్యలను వర్గీకరించి డివిజన్‌, జిల్లాస్థాయి సమస్యలైతే ఉన్నతాధికారులకు పంపించనున్నారు. ప్రతి వినతి పత్రానికి నమోదు సంఖ్య ఇచ్చి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టనున్నారు.

స్థానిక సమస్యలపై ఫిర్యాదులు

ధరణి, భూ రికార్డుల సమస్యలు, సర్వే వారసత్వ సమస్యలు, ఆదాయం, కులం, నివాస ధ్రువ పత్రాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, రైతుల సమస్యలు, సాగు నీటి అంశాలు, తాగు నీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్‌, గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందించవచ్చు.

మండల పరిషత్‌

కార్యాలయాల్లో నిర్వహణ

స్థానిక సమస్యలపై వినతుల స్వీకరణ

ప్రజావాణి పోర్టల్‌కు అనుసంధానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement