రెవెన్యూ వర్గాల పొరపాటు.. రిజిస్ట్రేషన్ల శాఖకు తలపోటు
22ఏ జాబితా అంశంలో ప్రజలకు సరికొత్త సమస్యలు
కలెక్టర్ల నుంచి ఎన్‌వోసీ తెచ్చుకుంటేనే రిజిస్ట్రేషన్ అంటున్న సబ్ రిజిస్ట్రార్లు
స్లాట్ బుక్ అయి రిజిస్ట్రేషన్ ఫీజు కింద చలానా కట్టిన తర్వాత మెలిక
స్పెషల్ డ్రైవ్‌తోనే పరిష్కారం అంటున్న భూచట్టాల నిపుణులు
అధికారులతో నేడు మంత్రి పొంగులేటి భేటీ
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితా (22ఏ) వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతూ ప్రజలకు కొంగొత్త పాట్లు తెచ్చిపెడుతోంది. 22ఏ జాబితా ఇచ్చే సమయంలో అప్‌డేట్ చేయకుండా పాత డేటాను యథాతథంగా పంపడం ద్వారా రెవెన్యూ వర్గాలు చేసిన పొరపాటు రిజిస్ట్రేషన్ల శాఖకు తలనొప్పిగా మారింది. ఇంకోవైపు ఈ వ్యవహారంలో కొత్తగా చేరిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) జారీ కొత్త దందాకు దారితీస్తోంది. ఏ ప్లాటు లేదా ఫ్లాట్‌కు ఎన్‌వోసీ జారీ చేయాలన్నా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) మొదలుకుని జిల్లా కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరగడమే కాకుండా ఎవరు ఎక్కడ ఎంత అడిగినా సమర్పించుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ 22ఏ భూములు, ఆస్తుల సమస్య.. తమ భూములు, ఆస్తులపై తమ హక్కులకు ఎసరు పెట్టేలా ఉందని వాపోతున్నారు. మరోవైపు కొత్తగా తెరపైకి వచ్చిన ఈ నిషేధిత భూముల జాబితా వ్యవహారం సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. సబ్ రిజిస్ట్రాస్టార్ కార్యాలయాలకు తమ డాక్యుమెంట్లు తీసుకెళ్లి తమ ఆస్తి లేదా భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్లాట్ బుక్ అయితే కానీ.. తెలియట్లే
నిషేధిత భూముల జాబితా కింద రిజిస్ట్రేషన్ కాకుండా తిరస్కారానికి గురవుతున్న ప్లాట్లు, ఫ్లాట్ల వివరాలు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అయిన తర్వాత కానీ తెలియడం లేదు. ఇది కొత్త సమస్యకు దారితీస్తోంది. ఎందుకంటే.. స్లాట్ బుక్ కావాలంటే సంబంధిత ఆస్తి, భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజును కూడా చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఫీజు చెల్లించాల్సిన తర్వాత అమ్మకందారులు, కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కోసం వెళితే..రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని సబ్ రిజిస్ట్రార్లు చెపుతున్నారు. నిషేధిత జాబితాలో ఉందని, డాక్యుమెంట్ పెండింగ్‌లో పెట్టడం తప్ప తామేమీ చేయలేమని అంటున్నారు. దీంతో డబ్బులు కట్టేందుకు కొనుగోలుదారులు వెనుకాడుతున్నారు. సంతకాలు పెట్టేందుకు అమ్మకందారులు అంగీకరించడం లేదు.
మరోవైపు బ్యాంకులు కూడా మంజూరు చేసిన రుణానికి సంబంధించిన చెక్కులు ఇవ్వడం లేదు. దీంతో అమ్మకందారులు, కొనుగోలుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఒకవేళ స్లాట్ బుక్ చేసుకుని, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోతే ఆ ఫీజు కింద చలానా రూపంలో చెల్లించిన డబ్బులు ఇప్పుడప్పుడే వాపస్ అయ్యే పరిస్థితులు కూడా లేవు. ఇలా రూ.90 కోట్లకు పైగా ఫీజులు ప్రభుత్వం దగ్గర ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం గమనార్హం. అలా పెండింగ్‌లో పడకుండా రిజిస్ట్రేషన్ పూర్తి కావాలంటే సదరు ఆస్తి లేదా భూమికి సంబంధించి ముందుగా ఎన్‌వోసీ తెచ్చుకోవాల్సి వస్తోంది.
ఎన్‌వోసీ దందా..
ఎన్‌వోసీ ప్రయాసతో కూడిన వ్యవహారంగా మారుతోంది. గత ప్రభుత్వాలు వేలం ద్వారా బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించగా అందులో కట్టిన ఫ్లాట్లకు, ఎప్పుడో 1970–80లలో రాజకీయ బాధితులు, మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వమే కేటాయించిన భూమికి, అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌సీ) పరిధిలోనికి వచ్చిన భూమికి సంబంధించి ఎన్‌వోసీ తొలుత ఎప్పుడు వచ్చిందో ఆ ఎన్‌వోసీనే మళ్లీ తెచ్చుకునేందుకు, ప్రభుత్వ భూమి ఉన్న సర్వే నంబర్‌లోనే ఉన్న పట్టా భూమికి అనుమతులు తెచ్చుకునేందుకు ప్రజలు మళ్లీ రెవెన్యూ బాట పడుతున్నారు. అయితే తమ ఆస్తి లేదా భూమికి ఎన్‌వోసీ ఇవ్వాలంటూ సంబంధిత రెవెన్యూ వర్గాలకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ జిల్లా కలెక్టర్ పేరుతో లేదంటే ఆర్డీవోకు దరఖాస్తు ఇచ్చిన తర్వాత స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) దగ్గరికి పరుగులు తీయాల్సి వస్తోంది. అక్కడి నుంచి తహశీల్దార్, ఆర్డీవో, ఆ తర్వాత అవసరమైతే కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఎక్కడ అవసరమైతే అక్కడ అడిగినంత సమర్పించుకుంటేనే ఈ ఎన్‌వోసీలు వస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
పరిష్కారం ఎలా?
తాజా పరిస్థితుల్లో స్లాట్ బుక్ అయిన తర్వాత తిరస్కారానికి గురవుతున్న రిజిస్ట్రేషన్ల జాబితా రోజురోజుకూ పెరుగుతోందని సబ్ రిజిస్ట్రార్లే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీలున్నంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. అయితే భూచట్టాల నిపుణులు మాత్రం అది అంత సులువు కాదని అంటున్నారు. ప్రస్తుతమున్న సర్వే నంబర్లకు బైనంబర్లు ఇవ్వడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదని, అసలు ఆ భూమిలో సర్వే చేయకుండా బైనంబర్లు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నారు. రెవెన్యూ (భూభారతి), రిజిస్ట్రేషన్ల శాఖ (ఐజీఆర్‌ఎస్) పోర్టళ్లలోని నిషేధిత భూములు, ఆస్తుల వివరాలు ఒకేచోట అందుబాటులో ఉంచాలని, ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.
యూఎల్‌సీ విషయంలో అప్పట్లో ఇచ్చిన ఎన్‌వోసీలను కార్డ్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయాలని, ప్రభుత్వ భూములను వేలం వేయడం లేదంటే అమ్మడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల పరం చేసిన డాక్యుమెంట్లు కూడా సబ్ రిజిస్ట్రార్లకు అందుబాటులో ఉంచాలని, గతంలో మాదిరి నిషేధిత జాబితాలోని సర్వే నంబర్లలోని ఆస్తులు లేదా భూముల విషయంలో పాత డాక్యుమెంట్లను తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు కల్పించాలని సూచిస్తున్నారు. సోమవారం ఉదయం సచివాలయంలో క్యూర్ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రాస్టార్లు, ఆర్డీవోలు, సబ్ రిజిస్ట్రాస్టార్లు, తహశీల్దార్లు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ కానున్న నేపథ్యంలో ఈ అంశంపై కూలంకషంగా చర్చించి ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్న దానిపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.


