మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి, సీఎల్పీ మీడియా సెంటర్‌లో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి, సంగారెడ్డిలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
చర్చల సవాళ్లతో రెండ్రోజులు రాజకీయ రచ్చ.. మూడోరోజు లేఖాస్ర్తాలు సంధించుకున్న అధికార, విపక్షాలు
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు మంత్రి జూపల్లి లేఖ
సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌క్లబ్‌కు రావాలని సవాల్
జూపల్లికి ప్రతి లేఖ రాసిన బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ చేసిన అప్పుల గణాంకాల వెల్లడి
మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ అప్పులు వివరించిన డిప్యూటీ సీఎం భట్టి
మంత్రి పొన్నం, ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి ప్రెస్‌క్లబ్‌కు జూపల్లి
బీఆర్‌ఎస్ నేతలపై మరోసారి ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా చేసిన అప్పులపై చెలరేగిన వివాదం మూడో రోజు కూడా కొనసాగింది. తొలిరోజు.. కేటీఆర్ చేసిన బహిరంగ చర్చ సవాల్‌తో రభస ప్రారంభం కాగా, రెండో రోజు గురువారం గన్‌పార్క్, తెలంగాణ భవన్ వేదిక గా రచ్చరచ్చ అయ్యింది. మంత్రివర్గ భేటీలోనూ చర్చనీయాంశమైంది. ఇక శుక్రవారం అప్పులపై అధికార పక్షం, విపక్షం లేఖాస్ర్తాలు సంధించుకున్నాయి. తాను చెప్పిన అప్పు లెక్కలకు కట్టుబడి ఉన్నానంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్‌ఎస్ నేతలకు లేఖలు రాశారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావుకు లేఖలు రాసిన ఆయన.. తాను చెప్పిన అప్పు లెక్కలు తప్పని కేసీఆర్‌తో చెప్పించినా, నిరూ పించినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు.
దీనిపై చర్చించేందుకు సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తున్నానని, బీఆర్‌ఎస్ నేతలు కూడా రావాలని సవాల్ చేశారు. చెప్పినట్లే సాయంత్రం ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు. బీఆర్‌ఎస్ నేతలు రాకపోవడంతో వారిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా మంత్రి జూపల్లి లేఖలపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్‌రావు.. తాను కూడా ఆయనకు ఒక లేఖ రాశారు.
కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పుల గణాంకాలతో పాటు, బీఆర్‌ఎస్ చేసిన అప్పుల లెక్కలను అందులో వివరించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి, తాను అప్పుల గురించి మాట్లాడిన వీడియోలను వాట్సాప్ ద్వారా మంత్రి జూపల్లికి పంపారు. ఇవి చూసిన తర్వాతైనా రాజీనామా చేయాలన్నారు. మరోవైపు సంగారెడ్డిలోనూ మాట్లాడుతూ..జూపల్లిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం భట్టి కూడా శుక్రవారం.. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్ హ యాంలో చేసిన అప్పులు, చెల్లింపులపై గణాంకాలు వెల్లడించారు.


