సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణులైన వారికి మీ సేవ కేంద్రాల ద్వారా మెమోలను జారీ చేయనున్నారు. సర్టిఫికెట్‌పై ప్రత్యేకంగా ఒక బార్‌కోడ్, సర్టిఫికెట్‌కు నంబర్ కూడా ఉంటాయి. 2011 నుంచి ఇప్పటివరకు టెట్ పరీక్ష పాసైన వారందరికీ ముద్రిత మెమోలను జారీచేస్తామని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మెమోను పొందేందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ మెమోపై అభ్యర్థి పేరు, ఫొటో, వేలిముద్ర/సంతకం, అభ్యర్థి పొందిన మార్కుల వివరాలుంటాయి. గతంలో టెట్ పరీక్ష పాసైన వారికి రెండు సార్లు ముద్రిత మోమోలు జారీచేశారు.
ఆ తర్వాత ఆన్‌లైన్ మెమోలను మాత్రమే జారీచేస్తున్నారు. దీంతో కొందరు నకిలీ మెమోలను తయారు చేస్తున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే క్వాలిఫై అయిన వారందరికీ మీ సేవ ద్వారా ముద్రిత మెమోలను జారీచేయాలని నిర్ణయించారు. వారం పదిరోజుల్లో ఈ మెమోలు అందుబాటులోకి వస్తాయని నవీన్ నికోలస్ తెలిపారు. కాగా, రాష్ట్రంలోని మరో వెయ్యి సర్కారు బడుల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
కొంపల్లిలోని శిక్షణకేంద్రంలో అధునాతన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. స్పోర్ట్ ట్రాక్ సహా మరికొన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. పనులు పూర్తైన తర్వాత విద్యార్థులకు శిక్షణ ఇస్తామని, అత్యుత్తుమ సేవలందించిన వారిని త్వరలోనే సన్మానించనున్నట్లు ఆయన వెల్లడించారు.


