సనత్‌నగర్ టిమ్స్‌లోని ఆపరేషన్ థియేటర్‌లో గల వైద్య పరికరాల గురించి సీఎం రేవంత్‌రెడ్డికి వివరిస్తున్న వైద్యాధికారిణి. చిత్రంలో భట్టి, నవీన్‌యాదవ్, క్రిస్టినా చోంగ్తూ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు
కూలిపోయే స్థితిలో ఉన్న ఉస్మానియాను నిర్వీర్యం చేశారు
సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌లలో ఆస్పత్రుల నిర్మాణం మర్చిపోయారు
వరంగల్‌లో పెద్ద మాటలు చెప్పి ఉన్న ఆస్పత్రిని కూల్చేశారు
సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభోత్సవంలో కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం
ఆయన, కుటుంబ సభ్యులు పదేళ్లలో ఫాంహౌస్‌లు కట్టుకున్నారని మండిపాటు
వైద్యంపై ఖర్చును భవిష్యత్తు పెట్టుబడిగా చూస్తున్నట్లు వెల్లడి
32 నెలల పాలనలో వైద్యంపై రూ. 21,800 కోట్లు ఖర్చు చేశామన్న సీఎం
అదనపు సమయం పనిచేసే ప్రభుత్వ వైద్యులకు ఇన్సెంటివ్‌లు ఇస్తామని ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ‘కూలిపోయే పరిస్థితిలో ఉన్న వందేళ్ల నాటి ఉస్మానియా ఆస్పత్రిని తిరిగి నిర్మించాలని పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఆలోచన చేయలేదు. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌లలో కొత్త ఆస్పత్రులకు టెంకాయ కొట్టి వాటి నిర్మాణం మర్చిపోయారు. వరంగల్‌లో పెద్ద మాటలు చెప్పి ఉన్న ఆసుపత్రిని కూల్చేశారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే వాళ్ల పార్టీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ (టిమ్స్ ఆస్పత్రి) కలియదిరిగారు. దీన్ని మేం కట్టాం.. రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నాడన్నారు. నువ్వు నిజంగా కడితే రిబ్బన్ కట్ చేయడానికి పదేళ్లలో సమయం దొరకలేదా? కేసీఆర్ నాకు సాయం చేసినా చేయకున్నా అలాంటి కొడుకును తెలంగాణకు ఇచ్చినందుకు నాకు మేలు జరిగింది. నీ (కేసీఆర్) కొడుకు అట్లనే ఉండాలి.. అబద్ధాలు చెప్పాలి. అప్పుడే నిజాలు ప్రజలకు అర్థమవుతాయి’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 1,082 పడకల (సూపర్ స్పెషాలిటీ) డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడారు.
మీ ఫాంహౌస్‌లు ఏమైనా ఆగాయా?
‘కేసీఆర్‌కు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల్లో ఫాంహౌస్.. ఆయన కుమారుడికి జన్వాడలో వంద ఎకరాల్లో ఫాంహౌస్.. ఆయన చెల్లికి శంకర్‌పల్లిలో 50 ఎకరాల్లో, బావ మొయినాబాద్‌లో 20 ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకున్నారు. అందులో ఏదైనా ఆగిందా? పేదల ఆస్పత్రులు ఏవైనా పూర్తి చేశారా? ఇంత కూడా ఆత్మపరిశీలన చేయకుండా సమాజం గమనిస్తుందని సిగ్గు పడకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటున్నారు. ఇకనైనా మీ బుద్ధి మారాలి. కరువు రావాలని అఘోర దీక్షలు, రైతులు చచ్చిపోవాలని చేతబడులు చేయించడం మానాలి. మీరు సంపాదించిన రూ. లక్ష కోట్లలో నియోజకవర్గానికి రూ. 10 కోట్లో లేదా రూ. 20 కోట్లో ఖర్చు చేస్తే.. నల్లమల, ఆదిలాబాద్ అడవుల్లో సేవలందిస్తే మీరు చేసిన పాపాలు తగ్గుతాయి’అని సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యం..
ప్రజాపాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమం, అభివృద్ధిని ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ఇప్పటివరకు 16 వేల మంది వైద్య సిబ్బందిని నియమించామన్నారు. వైద్యంపై ఖర్చును సంక్షేమం, ఖర్చు కింద చూడటం లేదని.. భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడిగా చూస్తున్నామని తెలిపారు. ‘ప్రస్తుతం విద్య, వైద్యం అత్యంత ఖరీదైనవిగా మారాయి. పేదలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే ఆస్తులమ్మినా సరిపోక కిడ్నీలు అమ్ముకొనే పరిస్థితి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అవగాహనతో ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యం అందించాలని నిర్ణయించింది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గుండె, కిడ్నీ బాగుండాలి. ఇందులో భాగంగానే మర్రి చెన్నారెడ్డి పేరుమీద వైద్య సాయం అందుబాటులోకి తెచ్చాం’అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. 32 నెలల పాలనలో ఆరోగ్యశ్రీ కోసం రూ. 2,700 కోట్లు కేటాయించామని, సీఎంఆర్‌ఎఫ్ రూ. 2,526 కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. ప్రజాప్రభుత్వంలో వైద్యం కోసం రూ. 21,800 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
10 వేల పడకలు అందుబాటులోకి..
రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యంతో ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గోషామహల్‌లో 2 వేల పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలోగా.. 2027 డిసెంబర్ 9 నాటికి ఉస్మానియా ఆస్పత్రి, ఎల్బీ నగర్‌లో, అల్వాల్‌లో ఇలా ప్రతి ఆరు నెలలకో ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. దీనివల్ల 10 వేల ఆసుపత్రి పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆయా ప్రభుత్వ ఆస్పత్రులను నిమ్స్, ఎయిమ్స్‌తో పోటీ పడి సేవలందించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. రోగులకు ఉచిత భోజనం, రోగుల సహాయకులకు డార్మిటరీలు, ఇతర వసతులు కల్పిస్తామని వివరించారు.
అదనంగా పనిచేసే వైద్యులకు ఇన్సెంటివ్‌లు
ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులను అదనపు సమయం పనిచేయాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అలా పని చేసే వారికి ఇన్సెంటివ్‌లు ఇస్తామన్నారు. ప్రభుత్వ వైద్యుల నైపుణ్యాన్ని, నేర్పరితనాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరే పేషెంట్ల కోసం ఉపయోగించుకోవాలని.. ప్రభుత్వం ఇన్సెంటివ్‌లు ఇవ్వకపోవడం వల్ల వారు ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అందువల్ల ఉన్నతాధికారులు ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కష్టం వస్తే తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ అన్న అండగా ఉన్నాడన్న విశ్వాసం ప్రజలకు కల్పించాలని చెప్పారు. అంతకుముందు టిమ్స్ ఆస్పత్రిలో వార్డులు, ఓపీ, ఓటీలలో సహచర మంత్రులు, అధికారులతో కలిసి సీఎం కలియతిరిగారు. సిబ్బందితో మాట్లాడారు. ఒక్కో వార్డును ఒక్కో మంత్రి, ఎమ్మెల్యేతో ప్రారంభోత్సవం చేయించారు. సురక్షిత ఆహారం, నాణ్యమైన మందులే లక్ష్యంగా టీజీ సేఫ్, ఆరోగ్య దీపిక పాలిక్లినిక్‌లను ప్రారంభించారు.
కోటి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో 1.06 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో 2023 నుంచి రూ. 8,923 కోట్లను ఆస్పత్రుల కోసం ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ‘కానీ మేం చేసిన ప్రతి పని తామే చేశామని చెప్పుకొనే తప్పుడు సంస్కృతితో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకునే ప్రతిపక్షం రాష్ట్రంలో తిరుగుతోంది’అని బట్టి విమర్శించారు. ప్రజారోగ్యం కోసం అక్టోబర్ నుంచి జులై వరకు యాక్సలరేటెడ్ పేమెంట్స్ చేయాలనే ఆలోచనతో రూ. 1,452 కోట్లు నిధులు కేటాయించినట్లు చెప్పారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రజారోగ్యం కోసం ఖర్చు చేసింది రూ. 70 కోట్లు మాత్రమేనన్నారు.
పేదల ఆరోగ్య రక్షణ మా ప్రభుత్వానిది: మంత్రి దామోదర
పేదల ఆరోగ్య రక్షణ తమ ప్రభుత్వానిదేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌ఓసీ కింద రూ. కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు బలోపతం చేశామని తెలిపారు. గాందీ, పేట్లబురుజు ఆస్పత్రుల్లో ఉచితంగా ఐవీఎఫ్ సేవలు అందిస్తున్నామని.. రాబోయే పదేళ్లలో తలసేమియారహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని లక్ష్యంగా పెటుకున్నామని మంత్రి దామోదర తెలిపారు. మూడు టిమ్స్ ఆస్పత్రులతోపాటు నిమ్స్, ప్రతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 100 పడకలను ఇంటర్నేషనల్ బెడ్స్ వింగ్ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రొ.కోదండరాం, బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, టిమ్స్, నిమ్స్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


